శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : శుక్రవారం, 12 ఏప్రియల్ 2019 (12:18 IST)

ఆంధ్రప్రదేశ్‌లో గెలుపోటములను శాసించనున్న ఉభయ గోదావరి ఓటర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల పోలింగ్ గురువారం చిన్నపాటి చెదురుముదురు సంఘటనలతో ముగిసింది. అయితే, ఈ ఎన్నికల్లో దాదాపుగా 77 శాతం పోలింగ్ నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. పోలింగ్ శాతంపై ఎన్నికల సంఘం ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెల్లడించలేదు. ఏదిఏమైనా ఏపీ శాసనసభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూకట్టారు. ఫలితంగా రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 
 
అయితే, రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ శాతం రికార్డు స్థాయిలో నమోదైనప్పటికీ గెలుపోటములను శాసించేది మాత్రం ఉభయ గోదావరి జిల్లాల ఓటర్లు మాత్రమే. ఈ రెండు జిల్లాల్లో దాదాపుగా 35 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిలో మెజార్టీ సీట్లను దక్కించుకునే పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. దీంతో ఈ జిల్లాల్లో ఓటరు నాడిపై వివిధ మీడియా సంస్థలు సర్వేఏజెన్సీలు లెక్కలు కడుతున్నాయి.
 
ఏపీలో ఎవరిని కదిలించినా మార్పు కావాలన్న తీరులోనే ఓటరు నాడి బయటపడడం విశేషం. అయితే ఇందులో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా వైసీపీ, జనసేన పార్టీల వైపు ఎంత మంది మొగ్గు చూపారన్న విషయం సస్పెన్స్‌గా మారింది. ముఖ్యంగా యువత అత్యధిక శాతం వైసీపీ వైపు జనసేన అధినేత పవన్ కళ్యాన్ వైపు చూపినట్టు తెలుస్తోంది. 
 
అయితే, మహిళా ఓటర్లలో అత్యధిక శాతం టీడీపీ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. వీరిలో పెన్షన్ దార్లు డ్వాక్రా మహిళా ఓటర్లు తమ పార్టీకే ఎక్కువ వేశారని టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారు. ఇక ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓట్లు వైసీపీ వైపు మొగ్గు చూపాయని చెబుతున్నారు. ఇక కాపు సామాజికవర్గం అత్యధికం జనసేన వైపు ఉండగా.. మరో ప్రధానమైన బీసీ సామాజికవర్గం ఓటర్లు మాత్రం టీడీపీ వైసీపీవైపే నిలిచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అంతుచిక్కని తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఓటరు నాడి ఏపీ రాజకీయ పీఠాన్ని డిసైడ్ చేయబోతున్నదని సమాచారం.