1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By వరుణ్
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2024 (14:02 IST)

ఎన్నికల ప్రచారం కోసం మళ్లీ ఏపీకి రానున్న ప్రధాని మోడీ!!

narendra modi
ఏపీలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా మే 13వ తేదీన జరుగనున్నాయి. ఈ ఎన్నికల కోసం ఆయా పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. టీడీపీ - జనసేన - బీజేపీలు కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఈ కూటమికి మద్దతుగా ఇప్పటికే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ హాజరై ప్రసంగించారు. ఇపుడు మరోమారు రాష్ట్రంలో కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందకు ఆయన ఏపీకి రానున్నారు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ అధిష్టానం వెల్లడించింది. ని మోదీ రాష్ట్రానికి రానున్నట్టు బీజేపీ మే 3, 4 తేదీల్లో ఏపీలో ప్రధాని పర్యటన ఉంటుందని వెల్లడించింది. 
 
ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు విస్తృత స్థాయి పర్యటనకు రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో, ఆయన పాల్గొనే సభలు, రోడ్ షోలపై ఏపీ బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. ఈ నెల 25తో ఏపీలో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండగా, ఎన్నికల ప్రచారంలో జోరు పెంచాలని కూటమి నిర్ణయించింది. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉత్సాహంగా ప్రచారం చేస్తుండగా, ప్రధాని మోడీ కూడా వస్తే కూటమిలో మరింత జోష్ వస్తుందని భావిస్తున్నారు.
 
ప్రధాని పర్యటించే ఆ రెండు రోజుల పాటు ఆయన వీలైనన్ని ఎక్కువ సభల్లో పాల్గొనేలా రోడ్ మ్యాప్ రూపొందించడంపై కూటమి నేతలు కసరత్తులు చేస్తున్నారు. కాగా, మోడీ పర్యటన అనంతరం, కేంద్రం నుంచి మరికొందరు స్టార్ క్యాంపెయినర్లు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నట్టు కూటమి నేతలు చెబుతున్నారు.