గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (19:54 IST)

దసరా పండగకు 1377 స్పెషల్ బస్సులు

రానున్న దసరా శెలవులు, వారాంతాలలో ప్రయాణీకుల రద్దీని తట్టుకునేందుకు హైదరాబాదు నుండి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు సెప్టెంబరు 27 తేదీ నుండి అక్టోబరు 7వ తేదీ  వరకు మామూలుగా నడిపే రెగ్యులర్ బస్సులకు అదనంగా 1377 స్పెషల్ బస్సులు (ప్రస్తుతానికి)  నడుపనున్నట్లు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) కె.వి.ఆర్.కె.ప్రసాద్ తెలియ చేశారు.

ప్రయాణీకుల రద్దీని బట్టి బస్సులు పెంచడం ద్వారా ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగినన్ని బస్సులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకొంటున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణీకుల సౌకర్యార్థం గత సంవత్సరం దసరా పండగకు 1196 స్పెషల్స్ ఏర్పాటు చేయగా, ఈ సంవత్సరం సెప్టెంబరు 27 నుండి రద్దీ మొదలవుతుందని గుర్తించి ఆ రోజు నుండి అక్టోబరు 7వరకు  అవసరమయ్యే స్పెషల్ బస్సులను అంచనా వేసి సిద్ధం చేస్తున్నట్లు, ఈ మేరకు అన్ని చర్యలు తీసుకోవలసిందిగా సంబంధిత జిల్లాల రీజినల్ మేనేజర్లకు ఇప్పటికే ఆదేశాలు పంపినట్లు కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తెలిపారు.
 
 పండగ శెలవుల ప్రారంభంలో సెప్టెంబరు 27  తేదీ శుక్రవారం సుమారు 135 స్పెషల్స్ హైదరాబాదు నుండి ఏ.పి లోని వివిధ ప్రాంతాలకు నడపనున్నారు.  వీటిలో గుంటూరుకు 18 బస్సులు; విజయవాడకు 30 బస్సులు, గోదావరి జిల్లాలకు సుమారు 32 బస్సులు, అలాగే ఒంగోలు నెల్లూరు వైపు 30 బస్సులు, కర్నూలు అనంతపురం కడప వైపు సుమారు 20  బస్సులు  నడపనున్నారు.
 
 అలాగే 28 తేదీన  85 స్పెషల్ బస్సులు, 29 తేదీన 22బస్సులు, 30వ తేదీన 15బస్సులు, అక్టోబరు 1 తేదీన 56బస్సులు, 2వ తేదీన 25బస్సులు, 3వ తేదీన 54బస్సులు  హైదరాబాదు నుండి వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపుతారు.
 
ఇక పండగ శెలవుల రద్దీ ఎక్కువగా ఉండే అక్టోబరు 4,5,6,7 తేదీలలో స్పెషల్ బస్సులు పెద్ద సంఖ్యలో   ఏర్పాటు చేయడం జరిగింది. 4తేదీన సుమారు 500 బస్సులు, 5తేదీన 302 బస్సులు, 6తేదీ దుర్గాష్టమి రోజున 123 బస్సులు, 7వ తేదీన 60 బస్సులు హైదరాబాదు నుండి వివిధ ప్రాంతాలకు నడపనున్నారు.

ప్రయాణీకుల సౌకర్యార్థం, ఇప్పటికే ఈ బస్సుల సీట్ల లభ్యతను సిద్ధం చేసి రిజర్వేషన్ కొరకు ఉంచినట్లు, కాబట్టి ప్రయాణీకులు ముందుగా తమ ప్రయాణ తేదీలకు టికెట్లు రిజర్వు చేసుకుని ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో సురక్షితంగా ప్రయాణించవలసిందిగా ఆర్టీసీ ఆపరేషన్స్ విభాగ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.