బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 25 ఆగస్టు 2020 (09:28 IST)

252వ రోజుకు రాజధాని రైతుల నిరసనలు.. అభిప్రాయ సేకరణకు వెబ్సైట్

రాజధాని అమరావతి కోసం రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు మంగళవారం 252వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు, వెలగపూడి, పెదపరిమి, రాయపూడి, బోరుపాలెం, అబ్బురాజు పాలెం, ఉద్దండరాయుని పాలెం తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.

రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం చేశారు. కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది. 
 
అమరావతిపై వెబ్‌సైట్‌
అమరావతికి సంబంధించి మొత్తం వాస్తవాలు అందరికీ తెలియడం కోసం కొత్తగా ఒక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ‘ఏపీ విత్‌ అమరావతి డాట్‌ కాం’ పేరుతో ఈ వెబ్‌ సైట్‌ పెడుతున్నామని, ఇందులో అమరావతిపై ప్రజాభిప్రాయ సేకరణ జరపడంతోపాటు ఆసక్తి ఉన్నవారు తమ అభిప్రాయాలు పంచుకునే అవకాశం కూడా కల్పిస్తున్నామని తెలిపారు.
 
ఏపీ రాజధాని పై ప్రజాభిప్రాయం కోరుదామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విసిరిన ఛాలెంజ్ ని ప్రభుత్వం స్వీకరించలేదు. అందుకే ప్రత్యేక వెబ్ సైటు http://www.apwithamaravati.com  ద్వారా చంద్రబాబు ప్రజాభిప్రాయాన్ని కోరుతున్నారు. 'ఈ వెబ్ సైట్ ద్వారా ఓటు వేయండి. అమరావతిని రక్షించుకోండి' అని ఆయన పిలుపునిచ్చారు.