గ్రామ, వార్డు సచివాలయాల్లో 470 పౌర సేవలు..
గ్రామ, వార్డు సచివాలయాల్లో 470 పౌర సేవలు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 15,002 సచివాలయాల్లో ప్రజలు నేటి నుంచి ఈ సేవలను ఉపయోగించుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఏయే సేవలను ఎన్ని గంటలు, రోజుల్లో అందించాలన్న విషయంపైనా సేవా పట్టికను అధికారులు సిద్ధం చేశారు. అత్యధిక సేవలు 72 గంటల్లో అందేలా కార్యాచరణ రూపొందించారు. 11 ప్రభుత్వశాఖలకు సంబంధించిన 540 సేవలను ప్రజలకు అందించాలన్నది సచివాలయాల ఉద్దేశం.
రుసుం చెల్లించి పొందే సేవలు అందుబాటులోకి రావడానికి మరో 5 రోజులు పట్టొచ్చని అధికారులు తెలిపారు. ప్రజలు చెల్లించే రుసుం.. సంబంధిత ప్రభుత్వ శాఖల బ్యాంకు ఖాతాలకు జమయ్యే ఏర్పాట్లు ప్రస్తుతం చేస్తున్నామని చెప్పారు.
ఇలాంటివి 70 మినహా మిగతా 470 సేవలు ప్రస్తుతం అందుబాటులోకి వస్తాయని అధికారులు వివరించారు.
ప్రతి సచివాలయానికి కంప్యూటరు, ఇంటర్నెట్ సదుపాయం, బల్లలు, కుర్చీలు, మొబైల్ అందజేశారు. ప్రజల నుంచి వినతుల స్వీకరణకు రోజూ విధిగా స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
మండల పరిషత్, పురపాలక కార్యాలయాల్లో శిక్షణ పొందుతున్న ఉద్యోగులు నిర్దేశించిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రజలకు సేవలందించాలి. అమలులో ఉన్న పింఛన్లపై ఇటీవల నిర్వహించిన సామాజిక సర్వే వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు.
ఇప్పుడున్న లబ్ధిదారుల్లో అర్హులు, అనర్హుల జాబితాలతోపాటు కొత్త దరఖాస్తుదారుల వివరాలూ పెట్టనున్నారు. వీటిపై వచ్చే అభ్యంతరాలమీద గ్రామసభలు నిర్వహించి నెలాఖరులోగా పింఛను లబ్ధిదారుల తుది జాబితాను సిద్ధం చేయాలని సిబ్బందిని అధికారులు ఆదేశించారు.