శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2019 (12:51 IST)

పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు: అసోంలో మొబైల్ ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ

పౌరసత్వ సవరణ చట్టం కారణంగా అసోంలోని ఏ పౌరుడి హక్కులనూ ఎవ్వరూ లాక్కోలేరని, అసోం భాష, గుర్తింపుకు ఎలాంటి ముప్పూ లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ చెప్పారు.
 
శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అస్సాం గౌరవం ఏరకంగానూ దెబ్బతినదని ఆయన వెల్లడించారు. తమకు ప్రజల మద్దతు ఎల్లప్పుడూ ఉందని, రాష్ట్రంలో శాంతితో తాము ముందుకెళతామని వివరించారు.
 
రజినీకాంత్ ట్వీట్‌: 'ఏ సమస్యకైనా పరిష్కారం కోసం అల్లర్లు, హింస మార్గం కాకూడదు'. 
 
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో సినీ నటుడు రజినీకాంత్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.
 
పౌరసత్వ సవరణ చట్టాన్ని కానీ, దానికి సంబంధించిన వివాదాన్ని కానీ రజినీకాంత్ ఈ ట్వీట్‌లో ప్రస్తావించలేదు.
 
‘‘ఏ సమస్యకైనా పరిష్కారం కోసం అల్లర్లు, హింస మార్గం కాకూడదు. భారతదేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేశ భద్రతను, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు కొనసాగతున్న హింస నన్ను చాలా బాధిస్తోంది’’ అని ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
ఈ ట్వీట్‌ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. శుక్రవారం ఉదయం 8 గంటల సమయానికి రజినీకాంత్‌కు మద్దతుగా #IStandWithRajinikanth అనే హ్యాష్ ట్యాగ్ ట్విటర్ ఇండియా ట్రెండ్స్‌లో 64 వేల ట్వీట్లతో తొలి స్థానంలో ఉండగా.. రజినీకాంత్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మనిషిలాగా ప్రవర్తించాడంటూ 17 వేల ట్వీట్లతో #ShameOnYouSanghiRajini అనే హ్యాష్ ట్యాగ్ మూడో స్థానంలో నిలిచింది.
 
‘‘రజినీ పరిణితిగల రాజకీయ వైఖరిని ప్రదర్శించారు. ఈ పరిస్థితిని వాడుకుని ప్రజాదరణ పొందడం ఆయనకు చాలా సులభం, కానీ పరిస్థితుల్ని రెచ్చగొట్టకుండా ఆయన ఒక వైఖరి తీసుకున్నారు’’ అని రజినీ ఫ్యాన్స్ జర్మనీ అనే ట్విటర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.
 
‘‘రజినీకాంత్ ఎక్కడా పౌరసత్వ సవరణ బిల్లును సమర్థించలేదు. శ్రీలంక తమిళులకు పౌరసత్వం ఇవ్వాలని కోరిన మొదటి వ్యక్తి ఆయనే. హింస పరిష్కారం కాదన్నారంతే. దేశంలో ఇలాంటి హింస మనకు కావాలా?’’ అని రజినీకాంత్ ఫ్యాన్స్ అనే మరొక ట్విటర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది.
 
‘‘దేనికైనా హింస పరిష్కారం కాదని మేం కూడా అంగీకరిస్తాం... కానీ పౌరసత్వ సవరణ చట్టంపై మీ వైఖరి ఏంటో స్పష్టం చేస్తారా, ఈ చట్టం మీకు అంగీకారమేనా? మిమ్మల్ని డైరెక్ట్ చేసిన యువ డైరెక్టర్లు సైతం ఈ చట్టంపై తమ అభిప్రాయం చెప్పారు. మీ అభిప్రాయాన్ని మేం ఎప్పుడు ఆశించగలం, తర్వాతి మూవీ ఆడియో లాంచ్‌లోనా’’ అని బూబలన్ అనే యూజర్ ట్వీట్ చేశారు.
 
‘‘సర్, మీరెందుకు ఒక వైఖరి తీసుకోరు? మీ రాజకీయ వ్యాఖ్యలు ప్రతిసారీ ఆ వైపు కానీ, ఈ వైపు కానీ ఉండవు. సురక్షిత రాజకీయాలు చేయడం మానండి, ఇవి పనిచేయవు’’ అని రక్షిత్ అనే యూజర్ ట్వీట్ చేశారు.