గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 డిశెంబరు 2020 (06:24 IST)

క‌ర్నూలు జిల్లాలో 686.5 కిలోల వెండి స్వాధీనం.. ఐదుగురు నిందితులు అరెస్టు

క‌ర్నూలు జిల్లా డోన్ స‌మీపంలోని 44వ జాతీయ ర‌హ‌దారిపై భారీగా వెండి ప‌ట్టుబ‌డింది. అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న 686.5కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా  తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఐదుగురు నిందితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

ఎటువంటి ఆధారాలు, పత్రాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న వెండిని పంచనామా ద్వారా స్వాధీనం చేసుకున్న  పోలీసులు. 686.5 కిలోల వెండి, ఒక కారు  స్వాధీనం చేసుకున్నారు. కృష్ణగిరి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

‌ముందస్తు సమాచారంతో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు అమకతాడు టోల్‌ప్లోజా వద్ద  పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. డోన్ రూరల్ సీఐ మహేశ్వరరెడ్డి, కృష్ణగిరి, వెల్దుర్తి, డోన్ రూరల్ ఎస్సైలు రామాంజనేయరెడ్డి, పెద్దయ్యనాయుడు, మధుసూదన్ పోలీసు సిబ్బందితో కలిసి టోల్‌ప్లాజా వద్ద నిఘా ఉంచారు.

హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వైపు వెళ్తున్న KA24 M 3751 మ‌హీంద్రా XUV కారును అమకతాడు టోల్‌ప్లాజా వద్ద ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. కారులో 18 చిన్న సంచుల్లో వెండి బిస్కెట్లు ఉన్నాయి. మొత్తం 686.5  కిలోల వెండి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  కారును , ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వీఆర్వో మరియు గోల్డ్ స్మిత్ పంచానామా ద్వారా వెండిని స్వాధీనం చేసుకుని  కృష్ణగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. నిందితులను విచారించారు. చత్తీస్ ఘడ్ రాష్ట్రం రాయపూర్ నుంచి తమిళనాడు రాష్ట్రం సేలానికి కారులో అక్రమంగా వెండిని తరలిస్తున్నట్లు తెలిసింది.

ఈ సంధర్బంగా  శుక్రవారం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ముద్దాయిల వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముద్దాయిలను మీడియా ముందు హజరు పరచడంలేదన్నారు. భారీగా వెండిని చాకచక్యంగా పట్టుకుని ప్రతిభకనబరచిన డోన్, కృష్ణగిరి, వెల్దుర్తి మరియు స్పెషల్ బ్రాంచ్ పోలీసులను డిజిపి గౌతమ్ సవాంగ్ కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లిని ప్ర‌త్యేకంగా అభినందించారు.

విలేక‌రుల స‌మావేశంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మహేశ్వరరెడ్డి,  డోన్ డిఎస్పీ నరసింహారెడ్డి, డోన్ రూరల్ సీఐ మహేశ్వరరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సిఐలు పవన్‌కిశోర్, శ్రీధర్, కృష్ణగిరి, డోన్ రూరల్ ఎస్సైలు  రామాంజనేయరెడ్డి,  మధుసూదన్, పోలీస్‌కానిస్టేబుళ్ళు  పాల్గొన్నారు.