1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 8 మే 2021 (16:18 IST)

ఆసుపత్రికి వెళ్తుంటే ఆయువు తీసిన తమిళనాడు ఆర్టీసి బస్సు

గూడూరు గ్రామీణం: ‘ఒంట్లో కాస్త నలతగా ఉంది.. నేను, నాన్న ఆసుపత్రికి వెళ్తున్నాం.. పది గంటలకల్లా వచ్చేస్తాం.. నువ్వు, చెల్లి జాగ్రత్త.. పరిస్థితులు బాగా లేవు.. బయట తిరగకండి.. ఇంట్లోనే ఉండండి’ అంటూ బిడ్డలకు జాగ్రత్త చెప్పింది. ఆపై దంపతులిద్దరూ ద్విచక్ర వాహనంపై నెల్లూరుకు బయల్దేరారు. ఈలోపే వారిపై విధికి కన్నుకుట్టింది.

వారు వెళ్తున్న వాహనాన్ని బస్సు ఢీకొనడంతో.. భార్య అక్కడికక్కడే దుర్మరణం చెందగా- భర్త పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర సంఘటన గూడూరు పట్టణ సమీపాన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామీణ పోలీసుల కథనం మేరకు.. కోట మండలం రామచంద్రపురానికి చెందిన కొమ్మలపూడి వెంకటేశ్వర్లు, కృష్ణమ్మ(38) దంపతులు.

వీరికి ఇంటర్మీడియట్‌ చదువుకున్న కుమారుడు, పదో తరగతి అభ్యసిస్తున్న కుమార్తె ఉన్నారు. కృష్ణమ్మకు ఆరోగ్యం బాగో లేకపోవడంతో నెల్లూరులోని ఓ ఆసుపత్రిలో చూపించేందుకు ఉదయాన్నే ద్విచక్ర వాహనంపై బయల్దేరారు. మార్గం మధ్యలోని గూడూరు సమీప జాతీయ రహదారిపై వెళ్తుండగా- వెనుక నుంచి తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొంది.

ఈ దుర్ఘటనలో దంపతులిద్దరూ రోడ్డుపై పడిపోగా- కృష్ణమ్మ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే కన్నుమూశారు. వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆయన్ను 108 వాహనంలో గూడూరు ప్రాంతీయాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సును పోలీసులు మనుబోలు వద్ద పట్టుకున్నారు.