ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: శుక్రవారం, 7 మే 2021 (18:44 IST)

కరోనా కాటుకు ఇద్దరు ఉపాధ్యాయులు బలి, బాపట్లలో కరోనా భయంతో వ్యక్తి సూసైడ్

గుంటూరు: జిల్లాలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు కరోనా బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. తాడికొండ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు (పీజీటీ) కె.వెంకటనరసమ్మ, బడేపురం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఎస్‌జీటీ కిశోర్‌కుమార్‌ గురువారం మృతి చెందారు.

వెంకటనరసమ్మ గుంటూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి, కిశోర్‌కుమార్‌ చినకాకానిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తొలుత కిశోర్‌కుమార్‌ ఇద్దరు పిల్లలకు కరోనా సోకడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారికి వైద్యులతో చికిత్స అందించడంతో తగ్గింది. తర్వాత ఆయనకు పాజిటివ్‌ రావడంతో వారం రోజుల కిందట ఆస్పత్రిలో చేరారు. వెంకటనరసమ్మ కూడా పది రోజుల కిందట ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఉపాధ్యాయులు ఇద్దరినీ కరోనా కాటు వేయడంతో వారి కుటుంబీకులను, సహచర ఉపాధ్యాయులను కలచివేసింది.
 
బాధితుని బలవన్మరణం..
బాపట్ల: ఇంటి ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితుడు మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన బాపట్లలో గురువారం చోటుచేసుకొంది. పట్టణంలోని రామకృష్ణాపురానికి చెందిన దర్జీ షేక్‌ మస్తాన్‌(44) ఇటీవల కరోనా బారినపడ్డాడు.

ఐదు రోజుల క్రితం కొవిడ్‌ అనుమానిత లక్షణాలతో ఓ ప్రైవేట్‌ ల్యాబ్‌లో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. అప్పటినుంచి మనస్తాపంతో ఇంట్లోనే ప్రత్యేకంగా గదిలో ఉంటూ ఔషధాలు తీసుకొంటున్నాడు. గురువారం మధ్యాహ్నం గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, వివాహమైన కుమార్తె ఉన్నారు.