బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: శనివారం, 8 మే 2021 (11:33 IST)

Corona second wave: ఒక్కరోజే 4187 మంది మృతి

దిల్లీ: దేశంలో కరోనా రక్కసి మరణమృదంగం కొనసాగుతోంది. నిత్యం లక్షల మందిపై విరుచుకుపడుతున్న ఈ మహమ్మారి.. తాజాగా ఒక్కరోజే 4వేలకుపైగా ప్రాణాలను బలి తీసుకుంది. దేశంలోకి కొవిడ్‌ ప్రవేశించినప్పటి నుంచి ఈ స్థాయిలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.  ఇక వరుసగా మూడో రోజు 4 లక్షలకు పైనే కొత్త కేసులు నమోదవడం మహమ్మారి ఉద్దృతికి అద్దం పడుతోంది.
 
శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 18,26,490 మందికి వైరస్‌ పరీక్షలు నిర్వహించగా.. 4,01,078 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.18కోట్లకు చేరింది.
 
ఇదే సమయంలో 4187 మంది కరోనాతో మృత్యుఒడికి చేరుకున్నారు. దీంతో వైరస్‌ ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు 2,38,270 మందిని కొవిడ్‌ బలితీసుకుంది. మరణాల రేటు 1.09శాతంగా ఉంది.
 
అయితే కొత్త కేసులతో పాటు రికవరీలు కూడా ఎక్కువగానే ఉంటుండం కాస్త సానుకూల పరిణామం. గడిచిన 24 గంటల్లో దాదాపు 3,18,609 మంది కరోనాను జయించారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1.79కోట్లకు చేరగా.. రికవరీ రేటు 81.95శాతంగా ఉంది.
 
ఇక కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో క్రియాశీల కేసులు 37లక్షలు దాటాయి. ప్రస్తుతం 37,23,446 మంది వైరస్‌కు చికిత్స తీసుకుంటుండగా.. క్రియాశీల రేటు 16.96 శాతంగా ఉంది.
 
దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నెమ్మదిగా సాగుతోంది. చాలా చోట్ల వ్యాక్సిన్ల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం 22,97,257 మందికి టీకాలు ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు 16.73కోట్ల మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు..