1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (12:43 IST)

చనిపోయిన టీచర్‌కు పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకన

govt school
గుంటూరు జిల్లాలో ఓ విచిత్రం జరిగింది. చనిపోయిన ఉపాధ్యాయుడికి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన చేసే విధులను జిల్లా విద్యాశాఖ అధికారి కేటాయించారు. ఈ డ్యూటీ చార్ట్ చూసిన ఇతర ఉపాధ్యాయులు విస్తుపోయారు. దీనిపై పాఠశాల కమిటీ ఛైర్మన్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఏపీలో శనివారంతో పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నెల 19వ తేదీ బుధవారం నుంచి మూల్యాంకన పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో జవాబు పత్రాల మూల్యాంకన కోసం హైస్కూలు టీచర్లకు విధులు అప్పగించారు. అయితే, గుంటూరు జిల్లా విద్యాధికారి కార్యాలయం మాత్రం చనిపోయిన ఓ ఉపాధ్యాయుడికి జవాబు పత్రాల మూల్యాంకన డ్యూటీ వేసింది. ఆర్డర్ కాపీ స్కూలుకు చేరడంతో మిగతా టీచర్లు విస్తుపోయారు. 
 
తెనాలిలోని ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్ టీచర్ గుడ్డేటి నాగయ్య అనారోగ్యంతో ఎనిమిది నెలల క్రితం విధులకు హాజరుకాలేదు. ఆరు నెలల క్రితం ఆయన చనిపోయారు. ఈ విషయం పరిగణనలోకి తీసుకోకుండా విద్యాశాఖ అధికారి కార్యాలయ సిబ్బంది నాగయ్యకు పదో తరగతి మూల్యాంకన పనుల డ్యూటీ వేశారు. 
 
నగరంలో స్టాల్ బాలికల ఉన్నత పాఠశాలలో విధులకు హాజరుకావాలంటూ డీఈవో సంతకంతో ఆర్డర్ కాపీ పాఠశాలకు చేరింది. ఇది చూసిన టీచర్లంతా ఆశ్చర్యపోయారు. పాఠశాల కమిటీ ఛైర్మన్ ఎం.రాజు దీనిపై కలెక్టర్ జేసీ రాజకుమారి గణియాకు ఫిర్యాదు చేశారు. దీంతో తేరుకున్న విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది.. తప్పును సరిదిద్దే పనిలో నిమగ్నమైంది.