మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (14:54 IST)

కాబూల్‌లో కాల్పుల మోత.. గగనతలం మూసివేత.. భారత్ విమానాలు రద్దు

ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ కాల్పుల మోతతో దద్ధరిల్లిపోతోంది. ఆ దేశం గగనతలాన్ని మూసివేశారు. దీంతో భారత్ సహా పలు దేశాలకు చెందిన విమాన సర్వీసులు రద్దు చేశారు. ముఖ్యంగా, సాధారణ వాణిజ్య విమానాల ప్రయాణానికి అక్కడి గగనతలాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. 
 
కేవలం సైనిక అవసరాల కోసమే ఎయిర్ స్పేస్‌ను వినియోగించుకోనున్నారు. దీంతో వివిధ దేశాల పౌరుల తరలింపునకు ఆటంకం ఏర్పడింది. కాబూల్‌లోని భారత పౌరులను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు విమానాలను కాబూల్‌కు పంపాలని అంతకుముందు నిర్ణయించింది. 
 
ఈ విమానాలను సోమవారం రాత్రి 8.30 గంటలకు పంపాలని ముందుగా అనుకున్నా.. ఆ తర్వాత పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం ఉందని గ్రహించి మధ్యాహ్నం 12.30 గంటల కల్లా కాబూల్‌కు పంపించాలని నిర్ణయించింది. కానీ, ఇప్పుడు ఆ గగనతలాన్ని మూసివేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కాబూల్‌కు పంపించాలనుకున్న రెండు విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది.
 
అలాగే, అమెరికా వెళ్లాల్సిన లేదా అక్కడి నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానాలన్నింటినీ ఆఫ్ఘన్ గగనతలం మీది నుంచికాకుండా దోహా మీదుగా మళ్లిస్తున్నట్టు ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. దోహా హాల్టింగ్లో ఇంధనం నింపుకుని ప్రయాణాన్ని మొదలుపెడతాయని చెప్పాయి. ఇప్పటికే షికాగో నుంచి వస్తున్న విమానాన్ని దారి మళ్లించారు.
 
ఇటు అమెరికాతో పాటు వివిధ దేశాలు తమ పౌరులను తీసుకెళ్లేందుకు కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నా ఇప్పుడు గగనతలాన్ని మూసివేయడంతో అక్కడే చిక్కుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, ఆప్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు ఆక్రమించుకున్న విషయం తెల్సిందే. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయాడు. కొత్త అధ్యక్షుడు తాలిబన్ నేత ఘనీ బరాదర్ నియమితులుకానున్నారు.