శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (10:37 IST)

తొమ్మిదేళ్ళుగా సహజీవనం.. మనస్పర్థలతో ఆత్మహత్యాయత్నం

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో ఓ విషాదకర ఘటన జరిగింది. తొమ్మిదేళ్లుగా సహజీవనం చేస్తూ వచ్చిన ఓ జంట చిన్నపాటి మనస్పర్థల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వీరిద్దరూ వేర్వేరు ప్రదేశాల్లో తనువు చాలించేందుకు యత్నించి ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. వీరిద్దరిని గుర్తించిన పోలీసులు... సరైన సమయంలో స్పందించి వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. 
 
నిడదవోలు పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. నిడదవోలు కూరగాయల మార్కెట్‌ సమీపంలో నివాసముంటున్న గూటం దుర్గ అనే యువతితో రాజానగరం సమీపంలోని కలవచర్ల గ్రామానికి చెందిన అంబులెన్స్‌ డ్రైవర్‌ దాసోహం రాము సహజీవనం చేస్తున్నాడు. అప్పటికే రాముకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 
దుర్గ సొంతూరు ఉండ్రాజవరం మండలం వడ్డూరు కాగా తొమ్మిదేళ్ల కిత్రం ఇంటి నుంచి బయటకు వచ్చి నిడదవోలు చర్ల సుశీల వృద్ధాశ్రమంలో చేరింది. ఆ సమయంలో రాముతో పరిచయమై వివాహేతర సంబంధం బలపడింది. ఈ క్రమంలో వీరికి ఓ పాప పుట్టగా పంగిడిలో ఉంటున్న బంధువులకు ఇచ్చేశారు. 
 
అనంతరం దుర్గ ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లింది. అక్కడ కొంతకాలం పనిచేసి నిడదవోలు వచ్చి కూరగాయల మార్కెట్‌ సమీపంలో అద్దె ఇంట్లో ఉంటోంది. ఆమె దుబాయి నుంచి వచ్చిన తర్వాత కూడా వీరి మధ్య సంబంధం కొనసాగింది. దుర్గ సంపాదించిన సొమ్ముతో రాము అంబులెన్స్‌ కూడా కొన్నాడు.
 
ఈ నేపథ్యంలో ఇటీవల వీరి మధ్య గొడవలు పెరగడంతో సోమవారం ఆత్మహత్య చేసుకుంటానని రాము ఆమెను బెదిరించాడు. పట్టణంలోని శ్మశానవాటికలో మద్యంలో పురుగు మందు కలిపి తాగాడు. అక్కడి నుంచి బైక్‌పై వచ్చి పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని ఓవర్‌ బ్రిడ్జి వద్ద దుర్గకు విషయం చెప్పాడు.
 
దీంతో మనస్తాపం చెందిన దుర్గ అతడి బైక్‌లో ఉన్న పురుగు మందు సీసా తీసి తానూ తాగింది. సమీపంలో ఉన్న పోలీసులు సకాలంలో స్పందించి వారిద్దరినీ స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు వీరిద్దరినీ ఉన్నత వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.