శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 24 ఆగస్టు 2017 (21:34 IST)

మూడో విడత రైతు రుణ మాఫీ... రూ.3,600 కోట్లు విడుదలకు సీఎం బాబు నిర్ణయం

అమరావతి : మూడో విడత రైతు ఉపశమనం కింద రూ.3,600 కోట్లు త్వరలో విడుదల చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. వేరుశనగకు బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతులకు రూ.10

అమరావతి : మూడో విడత రైతు ఉపశమనం కింద రూ.3,600 కోట్లు త్వరలో విడుదల చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. వేరుశనగకు బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతులకు రూ.105 కోట్ల విలువైన విత్తనాలు ఉచితంగా అందజేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 
 
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా, రైతులను ఆదుకోడానికి రుణ మాఫీ, పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ కింద వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు మూడో విడత రైతు రుణ ఉపశమనం(రుణ మాఫీ) పథకం కింద త్వరలో రూ.3,600 కోట్లును 10 శాతం వడ్డీతో కలిపి విడుదల చేయనున్నామన్నారు. 
 
బ్యాంకులు, ఇతర చిన్నచిన్న సమస్యల కారణంగా రైతు రుణమాఫీ పథకం కింద అర్హత ఉండి కూడా నష్ట పరిహారం అందని 7,793 రైతుల ఖాతాలకు రూ.18 కోట్లా 87 లక్షలు ఇటీవల జమ చేశామన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పంట బీమా కింద రూ.654 కోట్లకు గానూ రూ.558 కోట్లు రిలీజ్ చేసేశామని రైతులకు పంపిణీ కూడా మొదలైపోయిందని మంత్రి తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల కింద 2015 ఏడాదికి సంబంధించి 8 జిల్లాలకు 80 కోట్లా 34 లక్షలు విడుదల చేసేశామన్నారు. 
 
2016లో కరువు కారణంగా నష్టపోయిన మూడు జిల్లాలో అదనంగా 19 కోట్లా 35 లక్షలను మంజూరు చేశామన్నారు. ఈ మొత్తం కాకుండా ఇదే ఏడాది రూ.1600 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇదే సంవత్సరం భారీ వర్షాల కారణంగా 8 జిల్లాల పరిధిలో నష్టపోయిన రైతులకు రూ. 52 కోట్లు రెండు రోజుల క్రితం మంజూరు చేశామన్నారు. ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వైరస్ వల్ల నష్టపోయిన మినుము సాగు చేసిన రైతులకు 68 కోట్లా 68 లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు. 
 
6.65 లక్షల నవ ధాన్యాల కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించగా, 2 లక్షల కిట్లు ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. సబ్సిడీపై 4.97 లక్షల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 4.82 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేసేశామన్నారు. భూసార పరీక్షల కార్డుల పంపిణీలో దేశంలోనే ఏపీ మొదటి స్థానం నిలిచిందని కేంద్రం ప్రశంసించందని మంత్రి తెలిపారు. 54 లక్షల భూసార పరీక్షల కార్డులను పంపిణి చేయడం జరిగిందన్నారు. 
 
పక్కనున్న రాష్ట్రాలకంటే ఏపీలోనే రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అధికంగా నిధులు పంపిణీ చేస్తోందన్నారు. ఈ ఏడాది పంట రుణాల పంపిణీ కింద 28,622 కోట్లు పంపిణీ చేశామన్నారు. రాష్ట్ర చరిత్రలో 4.28 లక్షల కౌలు రైతులకు మొదటి సారిగా  బ్యాంకుల ద్వారా రూ.900 కోట్ల రుణాలిచ్చామన్నారు. ఇంత వరకూ ఏ ప్రభుత్వమూ ఇలా రుణాలు ఇవ్వలేదన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వేరుశనగ వేయని రైతులకు ప్రత్యామ్నాయంగా రూ.105 కోట్లు విలువ చేసే కంది, పెసర, సజ్జ, మినుము, కొర్ర విత్తనాలను ఉచితంగా అందజేయాలని నిర్ణయించామన్నారు.