శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 31 మే 2021 (10:36 IST)

జగన్ దోపిడీపై గ్రంథాలు విడుదల చేయాలేమో? ఆలపాటి రాజేంద్ర ప్రసాద్

రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసిన దానికి పుస్తకం విడుదల చేస్తే  మరి ప్రజల నుంచి దోచింది, వృథా చేసిన దానికి గ్రంథాలు విడుదల చేయాలేమో? అంటూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
జగన్ తన రెండేళ్ళ పాలనపై విడుదల చేసిన పుస్తకంపై ఆయన స్పందిస్తూ, జగన్ రెడ్డి రెండేళ్ల పాలనలో ఏం సాధించారని వైసీపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. తప్పుడు, అబద్దపు ప్రచారాలతో మోసం చేయడం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. బ్లూ మీడియాను అడ్డం పెట్టుకొని అసత్య ప్రకటనలతో మసిపూసి మారేడు కాయ చేసి ప్రజలను మభ్యకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నారు.
 
ప్రజలకు అది చేశాం, ఇది చేశామంటూ పుస్తకాలు అచ్చు వేయిస్తున్నారు. మరి ప్రజల నుంచి దోచింది, వృథా చేసింది అచ్చు వేయటానికి గ్రంధాలు సరిపోతాయా? అన్న అనుమానం ప్రజల్లో కలుగుతుంది. జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వ 6 లక్షల కోట్ల స్కాం చేసేందని అబద్దపు పుస్తకాలు అచ్చు వేశారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం రూ.6 అవినీతిని కూడా పట్టుకోలేకపోయారు. 
 
కేవలం రెండేళ్లలోనే వైసీపీ నాయకులు నింగి నుంచి నేల వరకు దోచేశారు. రూ.1,500 వచ్చే ట్రాక్టర్ ఇసుకను రూ.5 వేలకు పెంచేశారు. మద్యం రేట్లు మూడు రెట్లు పెంచి దోపిడీ చేస్తున్నారు. వాహనాల జరిమానాను 10 రెట్లు పెంచారు. నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజీల్ ధరలను ఆకాశనంటించారు. విద్యుత్ ధరలు, ఆర్టీసీ, పన్నులు, రిజిస్ట్రేషన్ చార్జీలు భారీగా పెంచి ప్రజల నడ్డివిరిచారు. 
 
సెంటు పట్టా పేరుతో భూములు దోచుకున్నారు. కమీషన్ల కోసం ప్రాజెక్టులు స్కీంల కోసం స్కాంలు చేస్తున్నారు. కేవలం రంగులు వేయడానికే రూ.3 వేల కోట్ల ప్రజా ధనం వృథా చేశారు. పత్రికా ప్రకటనల పేరుతో రూ.400 కోట్లు, అందులో బ్లూ మీడియాకు రూ.250 కోట్లకు పైనే దోచిపెట్టారు. దాదాపు 35 మందికి పైగా సలహాదారుల కోసం వందల కోట్ల వ్యయం, వైసీపీ కార్యకర్తలకు వాలెంటీర్ల పేరుతో వేల కోట్లు, ప్రజా ప్రయోజనం లేని ముఖ్యమంత్రి పర్యటనలతో ప్రజాధనం విచ్చల విడిగా వృధా చేస్తున్నారు. 
 
ప్రజావేదిక కూల్చివేతతో దుష్టపాలనకు శ్రీకారం చుట్టారు. మూడు రాజధానుల పేరుతో అమరాతిని అటకెక్కించారు. అన్న క్యాంటీన్లను రద్దు చేశారు అవే ఉంటే కరోనా సమయంలో పేదలకు మరింత సాయంగా నిలిచేవి. ఇక ప్రతిపక్ష పార్టీ నాయకులపై దాడుల కోసమే అధికార యంత్రాంగం అంతా పని చేస్తుంది. రెండేళ్ల పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, మహిళలకు చేసిన సంక్షేమం కంటే జరిగిన అన్యాయం, దోపిడీ పది ఇంతలుంది. 
 
ఇక దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు, అక్రమాలకు కొదవేలేదు. వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేశారు. ప్రభుత్వ ఉగ్రవాదం పెరిగిపోయింది.  రెండేళ్లల్లో జగన్ రెడ్డి చేసిన అభివృద్ధి, సృష్టించిన సంపద ఏంటో చెప్పే దమ్ము వైసీపీ నాయకులకు ఉందా? ఆస్తులు అమ్మటం, అప్పు చేయడం, పబ్జీ ఆడుకోవడం తప్పా జగన్ రెడ్డికి ఏమీ చేతకాదని ప్రజలకు ఇప్పటికే అర్థమయ్యింద అని ఆలపాటి ఆరోపించారు.