1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జనవరి 2020 (18:00 IST)

ఉంటే అమరావతిలో ఉంచాలి.. లేదంటే కడపను రాజధాని చేయాలి...

నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కడపలో సమావేశమైన అఖిలపక్ష నేతలు కోరారు. లేనిపక్షంలో కడపను రాజధానిగా చేయాలని ఈ సమావేశంలో పాల్గొన్న నేతలంతా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. 
 
ఈ అఖిలపక్ష సమావేశానికి ఒక్క వైకాపా మినహా మిగిలిన అన్ని పార్టీల నేతలంతా హాజరయ్యారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని తీర్మానం చేశారు. ఈ ప్రాంతం రాష్ట్ర ప్రజలందరికీ అందుబాటులో ఉందని వారంతా అభిప్రాయపడ్డారు. పైగా, గత ఐదేళ్లుగా అమరావతి రాజధానికి ప్రజలు అలవాటు పడ్డారని గుర్తుచేశారు. 
 
ఇప్పటికే అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు ఇక్కడ నుంచే పని చేస్తున్నాయని చెప్పారు. అందువల్ల అమరావతే రాజధానిగా నూటికి నూరు శాతం కొనసాగించాలనీ, రెండో ఆప్షన్‌ ఉంటే కడపలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. 
 
అలాగే, అమరావతి కోసం జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానించారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చినందున.. రాజధాని తరలింపులో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. రాజకీయ ప్రయోజనం కోసం కాకుండా కేంద్రం పెద్దన్న పాత్రను పోషించాలని సూచించారు.