శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2020 (20:51 IST)

అమరావతి వల్ల ఆదాయం కాదు కదా.. అప్పులపై వడ్డీలు కూడా రావు : సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి అభివృద్ధి కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేయడం శుద్ధ దండగ అని చెప్పుకొచ్చారు. పైగా, ఈ ప్రాంతం నగరంగా ఎదగడానికి అనేక ఏళ్లు పడుతుందన్నారు. 
 
జగన్ సీఎం అయిన తర్వాత నవ్యాంధ్రకు మూడు రాజధానులు ఉండాలన్న ప్రతిపాదన తెచ్చారు. ఇందులోభాగంగా, అమరావతిలో శాసన రాజధాని, విశాఖపట్టణంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యూడీషియల్ రాజధానిని ఏర్పాటుకు ఆయన పరితపిస్తున్నారు. కానీ, ఆయన దూకుడుకు కోర్టులు బ్రేకులు వేస్తున్నాయి. 
 
ఈ క్రమంలో ఆయన అమరావతిపై మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఆదాయాన్నిచ్చే నగరం కాదని తేల్చిచెప్పారు. ఈ ప్రాంతం ప్రధాన నగరంగా ఎదగడానికి ఏళ్లు పడుతుందన్నారు. రూ.లక్ష కోట్లు పెట్టుబడి పెట్టడం లాభదాయకం కాదన్నారు. 
 
రూ.లక్షల కోట్లు వెచ్చించినప్పటికీ ఆదాయం కాదు కదా.. అప్పులపై వడ్డీలు కూడా అమరావతి వల్ల రావని స్పష్టం చేశారు. 33 వేల ఎకరాలు భారీ నిర్మాణాలకు పనికిరావు.. 500 ఎకరాల్లో నిర్మిస్తే సరిపోయేదన్నారు. 
 
మరోవైపు, ఆయన మంత్రివర్గంలోని మంత్రి కొడాలి నాని కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన విషయంతెల్సిందే. అమరావతిలో శాసనరాజధానే కాదు.. ఏమీ ఉండకూడదంటూ మండిపడ్డారు. పేదలు నివసించడానికి జానెడు స్థలం ఇవ్వలేని అమరావతి ఎందుకు అంటూ ఆయన మరోమారు ప్రశ్నించారు. 
 
అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దని, రైతులు కొనేందుకు భూమి, పేదలకు ఇచ్చేందుకు ఇళ్ల స్థలాలు లేని ప్రాంతంలో రాజధాని ఎందుకంటూ ఆయన నిలదీశారు. ఈ విషయంలో తాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోనూ చర్చించానని తెలిపారు. అమరావతిలో పేదలకు 50 వేల ఇళ్ల పట్టాలను ప్రభుత్వం నిర్ణయించగా, వాటిని ఇవ్వవద్దంటూ నిరసనకారులు అడ్డుపడుతున్నారని నాని ఆరోపించారు.
 
తన వాదనను ఆలకించిన తర్వాత సీఎం సైతం ఈ విషయాన్ని పరిశీలిస్తానని తెలిపారని, పలువురు ఇతర నేతలు, అమరావతి ప్రాంత పేదలను సంప్రదించిన తర్వాతనే తాను శాసన రాజధానిని కూడా ఈ ప్రాంతం నుంచి తొలగించాలన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చానని అన్నారు. కనీసం తమ పార్టీ నేత లోకేశ్‌ను ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయిన తెలుగుదేశం పార్టీకి ఈ విషయంలో వాదించే అర్హత కూడా లేదని మంత్రి కొడాలి నాని విమర్శించారు.