సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 సెప్టెంబరు 2020 (15:08 IST)

మంత్రి పదవి వెంట్రుకతో సమానం... దిష్టిబొమ్మలు తగలేస్తే నాకేంటి : మంత్రి

తనకు మంత్రిపదవి వెంట్రుకతో సమానమని ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. పైగా, అమరావతి రైతులు తన దిష్టిబొమ్మలు తగలేస్తే తనకు పోయేది ఏమీలేదన్నారు. పేదలకు స్థానంలేని అమరావతిలో ఎలాంటి నిర్మాణాలు, శాసనరాజధానులు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఇదే అంశాన్ని తాను ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లానని, ఆయన కూడా ఆలోచన చేస్తానని తెలిపారు. 
 
అమరావతిలో పేదలకు 50 వేల ఇళ్ల పట్టాలను ప్రభుత్వం నిర్ణయించగా, వాటిని ఇవ్వవద్దంటూ నిరసనకారులు అడ్డుపడుతున్నారని నాని ఆరోపించారు. తన వాదనను విన్న తరువాత, సీఎం సైతం ఈ విషయాన్ని పరిశీలిస్తానని తెలిపారని, పలువురు ఇతర నేతలు, అమరావతి ప్రాంత పేదలను సంప్రదించిన తరువాతనే తాను శాసన రాజధానిని కూడా ఈ ప్రాంతం నుంచి తొలగించాలన్న డిమాండ్ ను తెరపైకి తెచ్చానని అన్నారు. కనీసం తమ పార్టీ నేత లోకేశ్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయిన తెలుగుదేశం పార్టీకి ఈ విషయంలో వాదించే అర్హత కూడా లేదని అన్నారు.
 
మంత్రి కొడాలి నానిపై మరో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. కొడాలి నాని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పారు. శాసన రాజధానిని అమరావతి నుంచి తరలిస్తామని ప్రభుత్వం చెప్పలేదని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఉండేందుకు అనువుగా రాజధాని ఉండాలనే ఉద్దేశంతో నాని అలా మాట్లాడారని చెప్పారు. 
 
కొంత మందే రాజధానిలో ఉండాలనే అభిప్రాయం తప్పు అనేది నాని అభిప్రాయమని అన్నారు. రాజధానిలో పేదలకు పట్టాలు ఇవ్వొద్దని చెప్పడం సబబు కాదని తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని... అయితే కొందరు కూట్రపూరితంగా సాంకేతిక అంశాలను అడ్డు పెట్టుకుని ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డుపడుతున్నారని మండిపడ్డారు.