మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (14:07 IST)

అమరావతిలో నిర్మించిన భవంతులను ఏం చేద్ధాం? ప్రత్యేక కమిటీ ఏర్పాటు!

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించిన బహుళ అంతస్తులపై ఏపీ సర్కారు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ నేతృత్వంలో ఈ కమిటీ ఏర్పాటైంది. 
 
మొత్తం తొమ్మిది మందితో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ శాసన రాజధానిగా అమరావతికి అవసరమయ్యే భవనాలు, నివాస సముదాయాలను గుర్తించడంతో పాటు ఇప్పటికే పనులు ప్రారంభమై, అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ నివాస సముదాయాలను ఏం చేయాలో సూచించనుంది. 
 
సీఎస్‌ అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీకి మెంబర్‌ కన్వీనర్‌గా ప్రణాళిక శాఖ కార్యదర్శి, ప్రత్యేక ఆహ్వానితుడిగా సీఎం ముఖ్య సలహాదారు, సభ్యులుగా సాధారణ పరిపాలన, పురపాలక, ఆర్థిక, న్యాయశాఖల ముఖ్య కార్యదర్శులు, ఏపీఎల్‌ఏ కార్యదర్శి, ఏఎంఆర్డీయే మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ నియమితులయ్యారు. 
 
అమరావతిలో వివిధ దశల్లో నిర్మాణం నిలిచిపోయిన అపార్ట్‌మెంట్లు, బంగ్లాలు, ఇతర భవంతులను తొలుత నిర్ణయించిన విధంగా పూర్తి చేయాలా లేక వాటిని కుదించి, ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గించేందుకు అవకాశాలున్నాయా అనే అంశాలపై కమిటీ నివేదిక ఇవ్వనుంది.