శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 11 ఫిబ్రవరి 2021 (13:35 IST)

స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఈ లిక్కర్ బ్రాండ్లు నిజంగానే ఉన్నాయా?

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం పాలసీ విషయంలో ప్రభుత్వాలు పలు మార్పులు చేస్తూ వస్తున్నాయి. పాలకులు మారిన ప్రతి సందర్భంలోనూ కొత్త విధానం అమలులోకి వస్తోంది. గత ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు వైఎస్ జగన్ మద్యం నియంత్రణకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అమ్మకాలను పూర్తిగా ప్రభుత్వ పరం చేశారు. వివిధ కంపెనీల నుంచి కొనుగోలు చేసిన కొన్ని బ్రాండ్లను ఏపీలో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలోనే అమ్మకాలు చేస్తున్నారు.

 
కొన్ని ప్రముఖ బ్రాండ్ల మద్యం అందుబాటులో ఉండటం లేదని ఇప్పటికే అనేక మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా విపక్ష సభ్యులు ఈ విషయం ప్రస్తావించారు. అదే సమయంలో చిత్రవిచిత్రమైన పేర్లతో కనిపిస్తున్న కొన్ని బ్రాండ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ప్రెసిడెంట్ మెడల్ పేరుతో ఉన్న చీప్ లిక్కర్ చుట్టూ పెద్ద చర్చ సాగింది. ఆ తర్వాత తాజాగా త్రీ క్యాపిటల్స్, స్పెషల్ స్టేటస్ అంటూ మరో రెండు బ్రాండ్లు వైరల్ అయ్యాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నిజంగానే ఈ బ్రాండ్లు ఉన్నాయా అనే విషయంపై బీబీసీ వివరాలు సేకరించింది.

 
చర్చనీయమైన ఆ రెండు అంశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంపై చర్చ సందర్భంగా 2013లో నాటి ప్రధాని ప్రత్యేక హోదా విషయంలో హామీ ఇవ్వడంతో స్పెషల్ స్టేటస్ ఇవ్వాలనే డిమాండ్ ఏపీలో నేటికీ వినిపిస్తోంది. కేంద్రం ఇప్పటికే పలుమార్లు ఈ విషయం తమ పరిశీలనలో లేదని, నీతి అయోగ్ సిఫార్సుల మేరకు ప్రస్తుతం అలాంటి ప్రతిపాదనలు లేవని తేల్చేసింది. అయినప్పటికీ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కూడా ప్రత్యేక హోదా ఏపీకి ఇవ్వాలంటూ వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కోరారు. దాంతో ఆరేడేళ్లుగా ప్రత్యేక హోదా చుట్టూ పెద్ద చర్చ సాగుతోంది.

 
అదే సమయంలో 2019 డిసెంబర్‌లో మూడు రాజధానుల ప్రతిపాదనను వైఎస్ జగన్ ముందుకు తీసుకువచ్చిన నాటి నుంచి అమరావతి పరిరక్షణ పేరుతో ఉద్యమం మొదలయ్యింది. ఇక కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ, న్యాయ సంబంధిత రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉంటాయని ప్రభుత్వం అంటోంది. మూడు రాజధానుల విషయం ఇప్పటికే చట్ట రూపం దాల్చింది. అయితే దానిపై ప్రస్తుతం ఏపీ హైకోర్టులో విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా, మూడు రాజధానులు అంశాలు ఏపీ జనం నోళ్లలో బాగా నానుతున్నాయి.

 
లిక్కర్ బ్రాండ్లలోనూ అవే..
ప్రజల్లో విస్తృత చర్చనీయాంశాలుగా ఉన్న స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్ అనే పేరుతో రెండు మద్యం బాటిళ్లు అమ్మకాలు సాగుతున్నట్టు సోషల్ మీడియాలో ఇటీవల ప్రచారం సాగింది. జనవరి 31నాడు ట్విట్టర్‌లో నా ఇష్టం, 60-40 టీడీపీ-వైసీపీ పేరుతో ఉన్న హ్యాండిల్స్ నుంచి తొలుత స్పెషల్ స్టేటస్ పేరుతో ఉన్న లిక్కర్ బాటిల్ దర్శనమిచ్చిది. ఆ తర్వాత ఫేస్‌బుక్ సహా వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో అది హల్ చల్ చేసింది. టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా పలువురు ప్రముఖుల పేజీలపై కూడా అది దర్శనమిచ్చింది.

 
ఆ తర్వాత రెండు రోజులకే శ్రీనివాస్, దివాకర్ ఎన్ సర్వేష్ అనే పేరుతో ఉన్న హ్యాండిల్స్ నుంచి ట్విట్టర్‌లో త్రీ క్యాపిటల్స్ ముద్రతో ఉన్న విస్కీ బాటిల్ దర్శనమిచ్చింది. తదుపరి ఇతర వేదికల మీద కూడా ఇది వైరల్ అయ్యింది. స్పెషల్ స్టేటస్ తో పాటుగా త్రీ క్యాపిటల్ పేరుతో ఉన్న బాటిల్స్ రెండూ దాదాపుగా ఒకేలా ఉండడం, కేవలం పేరు మార్పు తప్ప ఒకే తరహా బాటిల్‌కి వేర్వేరు ముద్రలు వేసినట్టుగా కనిపించింది.

 
అంతకుముందు ప్రెసిడెంట్ మెడల్
ఈ రెండు బ్రాండ్ల కన్నా ముందు బాగా వైరల్ అయిన లిక్కర్ బాటిల్ ప్రెసిడెంట్ మెడల్. రూ. 180కే ప్రెసిడెంట్ మెడల్ అంటూ గత ఏడాది ఆగస్టులో సోషల్ మీడియాలో మీమ్స్, సెటైర్లు మారుమోగాయి. టీడీపీ, జనసేన సహా విపక్షాలు ఇతరులు కూడా ఈ బ్రాండ్ మీద తీవ్ర విమర్శలు చేశారు. చివరకు ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 2019 ఏప్రిల్ 19న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సోరింగ్ అనే స్పిరిట్స్ సంస్థ 'ప్రెసిడెంట్ మెడల్' బ్రాండ్ పేరుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేయగా, నాటి టీడీపీ ప్రభుత్వమే దానికి అనుమతినిచ్చిందని జీవో చూపిస్తూ వైసీపీ సోషల్ మీడియాలో ఎదురుదాడికి దిగింది. రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నప్పటికీ ఏకంగా ప్రెసిడెంట్ మెడల్ పేరుతో విస్కీ అమ్మకాలు చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

 
‘ఆ బ్రాండ్‌ను నిలిపివేశాం’
సాధారణ ప్రజల నుంచి కూడా తీవ్ర అభ్యంతరం రావడంతో ప్రెసిడెంట్ మెడల్ బ్రాండ్ అమ్మకాలు నిలిపివేశారు. అప్పట్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన లిక్కర్ స్టాక్ మినహా ఆ తర్వాత ప్రెసిడెంట్ మెడల్ పేరుతో అమ్మకాలు చేయలేదని ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ అసిస్టెంట్ మేనేజర్ కే వెంకటరమణ బీబీసీకి తెలిపారు. ‘‘గత ప్రభుత్వం అనుమతినివ్వడంతో ప్రెసిడెంట్ మెడల్ బ్రాండ్ అమ్మకాలు చేశాం. అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఆ తర్వాత దానిని నిలిపివేశాం. మూడు నెలలుగా అది పూర్తిగా అందుబాటులో లేదు. ఇతర రకాల చీప్ లిక్కర్ మాత్రమే అమ్ముతున్నాం’’ అని ఆయన వివరించారు.

 
పేర్లు ఎలా పెడతారు?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రభుత్వమే మద్యం అమ్మకాలు సాగిస్తున్న నేపథ్యంలో వివిధ కంపెనీల నుంచి లిక్కర్ కొనుగోలు చేస్తోంది. మద్యం తయారీదారులు బ్రాండెడ్ లిక్కర్‌తో పాటుగా, చీప్ లిక్కర్ కూడా ప్రభుత్వానికి సరఫరా చేస్తారు. ప్రభుత్వ మద్యం డిపోల నుంచి అవసరాలకు అనుగుణంగా రీటైల్ దుకాణాలకు చేరుస్తారు. అక్కడే మద్యం ప్రియులకు నిర్దేశిత సమయంలో మద్యం అమ్మకాలు చేస్తున్నారు.

 
‘‘ప్రస్తుతం 70 కంపెనీల నుంచి లిక్కర్ కొనుగోలు చేస్తున్నాం. జనం కోరుతున్న మేరకు కొన్ని బ్రాండ్లను ప్రవేశపెట్టాం. బీర్లలో పాపులర్ బ్రాండ్లు కూడా ఇప్పుడు లభిస్తున్నాయి. గోవా, కర్ణాటకతో పాటుగా ఏపీలోని వివిధ సంస్థలు ప్రభుత్వం వేసిన టెండర్ ప్రకారంగా సరఫరా చేస్తున్నారు. బ్రాండ్ పేర్లు కంపెనీలే నిర్ణయిస్తాయి. అందులో అవసరమైన వాటిని ఏపీబీసీఎల్ తరుపున అనుమతిస్తాం. సామాన్య ప్రజలకు తెలిసేలా పేర్లు ఉంటాయే తప్ప అందులో మరో ఉద్దేశం ఉండదు’’ అని ఏపీబీసీఎల్ ఏఎం బీబీసీకి వివరించారు.

 
స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్ సంగతేంటి?
ఏపీలో మద్యం దుకాణాల వద్ద స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్స్ అనే పేరుతో ఎన్నడూ మద్యం అమ్మకాలు జరగలేదని ఏపీబీసీఎల్ చెబుతోంది. ఆ బ్రాండ్లు అమ్ముతున్నట్లు జరిగిన ప్రచారం అవాస్తవమని అంటోంది. కొన్ని మద్యం షాపుల వద్ద ఆరా తీసినప్పటికీ అలాంటి బ్రాండ్లు అమ్మిన దాఖలాలు లేవని సేల్స్ మెన్ కూడా చెప్పారు.

 
ఫొటోలను మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో కొందరు అసత్య ప్రచారం చేసి ఉంటారని ఏపీబీసీఎల్ అధికారులు అంటున్నారు.‘‘ఏదో ఒక మందు బాటిల్ తీసుకుని దాని బ్రాండ్ పేరును మార్ఫింగ్ చేసి మార్చి ఉంటారు. విషయం మా దృష్టికి కూడా వచ్చింది. కానీ, మేం అమ్మనప్పుడు దానికి ఎందుకు స్పందించాలని ఊరుకున్నాం. అలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అన్నింటికీ స్పందించలేం. త్రీ క్యాపిటల్స్, స్పెషల్ స్టేటస్ అనే పేర్లు ఎప్పుడూ ప్రస్తావనకు కూడా రాలేదు. కాబట్టి మేం పట్టించుకోలేదు’’ అని కే వెంకటరమణ వివరించారు. అధికారులు చెప్పడంతో పాటుగా క్షేత్రస్థాయిలో కూడా మద్యం బాటిళ్లలో ఈ రెండు పేర్లు ఉన్నట్టు కనిపించలేదు. ప్రెసిడెంట్ మెడల్ విస్కీ కూడా అమ్మకాలు నిలిపివేశారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం వాటిపై ఇంకా పోస్టింగ్స్ కొనసాగుతూనే ఉన్నాయి.