గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2024 (10:24 IST)

అమరావతిలో మరోమారు ల్యాండ్ పూలింగ్... త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం..

amaravati capital
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మరోమారు భూసేకరణ చేపట్టనున్నారు. రాజధాని నిర్మాణం కోసం గతంలో తెలుగుదేశం పార్టీ రైతుల నుంచి భారీ ఎత్తు ల్యాండ్ పూలింగ్ పేరుతో భూసేకరణ చేపట్టింది. ఆ తర్వాత వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆటకెక్కించింది. అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులపైనే కేసులుపెట్టి వేధించింది. ఈ నేపథ్యంలో ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. దీంతో అమరావతి నిర్మాణం పనుల్లో కదలిక ఏర్పడింది. ఇందులోభాగంగా, మరో 3558 ఎకరాల మేరకు భూ సేకరణ చేపట్టనున్నారు. అలాగే, అమరావతి నిర్మాణ పనులను కూడా డిసెంబరు ఒకటో తేదీ నుంచి ప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారు. 
 
దీనిపై ఏపీ మున్సిపల్ శాఖామంత్రి పి.నారాయణ మాట్లాడుతూ, అమరావతి రైతులకు గత వైకాపా ప్రభుత్వం రూ.175 కోట్లను పెండింగ్‌లో ఉంచిందని తెలిపారు. ఈ మొత్తాన్ని సెప్టెంబరు 15వ తేదీలోగా చెల్లిస్తామన్నారు. ఈ యేడాదిలో ఇవ్వాల్సిన రూ.225 కోట్లను కూడా వీలైనంత త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అమరావతి నిర్మాణంపై ఐఐటీ చెన్నై, ఐఐటీ హైదరాబాద్‌ల నుంచి సెప్టెంబరు మొదటి వారంలో నివేదికలు వస్తాయన్నారు. 2025 నాటికి అమరావతిలో ఉన్న అన్ని నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో ప్రారంభమవుతాయని తెలిపారు. హైటెక్ నగరంగా అమరావతిని నిర్మిస్తామని తెలిపారు.