శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 9 జులై 2019 (12:31 IST)

మోడీతో పెట్టుకోవద్దని చెప్పా.. ప్చ్.. వినలేదు.. లోకేశ్‌కు అంత సీన్ లేదు: అంబికా కృష్ణ

ప్రధాని నరేంద్ర మోడీతో పెట్టుకోవద్దని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పలుమార్లు చెప్పానని కానీ ఆయన తన మాటను పెడచెవిన పెట్టారని ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన అంబికా కృష్ణ చెప్పుకొచ్చారు. అలాగే, చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌కు అంత సీన్ లేదని ఆయన తీసిపారేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తాను రెండు దశాబ్దాలుగా టీడీపీలో ఉన్నాననీ, అలాంటి తాను బీజేపీలోకి వెళతానని చంద్రబాబు అస్సలు ఊహించివుండరన్నారు. కానీ, పార్టీ మారే విషయాన్ని మాత్రం సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మాత్రం ముందే చెప్పానని తెలిపారు. కానీ, చంద్రబాబుతో మాత్రం మాటమాత్రం కూడా చెప్పలేదన్నారు. 
 
టీడీపీలో ఉన్నప్పుడు పార్టీ కోసం అహర్నిశలు పనిచేశాననీ, భారీగా డబ్బులు ఖర్చు పెట్టామని పేర్కొన్నారు. చంద్రబాబు ఏపీలో ఎంత బాగా పనిచేసినా, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని అభిప్రాయపడ్డారు. నారా లోకేశ్‌కు ప్రజల్లో అంత ఆదరణ లేదన్నారు. నిజంగా అంత ఆదరణ ఉండి ఉంటే మంగళగిరిలో లోకేశ్ గెలిచిఉండేవాడని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలు ఎటువైపు ఉన్నారో సులభంగా అర్థం అయిపోతుందన్నారు. ఇప్పుడు ఓ రాజకీయ పార్టీగా టీడీపీ నిలదొక్కుకోవడం చాలా కష్టమని అంబికా కృష్ణ చెప్పారు. 
 
పైగా, ప్రధాని నరేంద్ర మోడీతో పెట్టుకోవద్దని చాలాసార్లు చెప్పానని చెప్పారు. "నేను చంద్రబాబుకు చెప్పాను. పెద్దవాళ్లతో కూడా చెప్పించాను. సార్.. మనకు మోడీతో గొడవవద్దు. మనకు కావాల్సింది మళ్లీ అధికారంలోకి రావడం అని చెప్పా. కానీ చంద్రబాబు వినిపించుకోలేదు", అందుకే ఇపుడు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు.