శనివారం, 9 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 మే 2022 (11:46 IST)

రణక్షేత్రంగా కోనసీమ : అమలాపురంలో 144 సెక్షన్ అమలు

busfire
పచ్చటి కోనసీమ ప్రాంతం ఇపుడు రణక్షేత్రాన్ని తలపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుంండా ముందస్తు జాగ్రత్తగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌తో పాటు పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఘర్షణలకు కేంద్రమైన అమలాపురం పట్టణాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు. 
 
పట్టణంలో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. ప్రజా రవాణాకు కీలకమైన ఆర్టీసీ బస్సు సర్వీసులను రద్దు చేశారు. అలాంటి అల్లర్లు జరుగకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పోలీసు బలగాలను రప్పించి భారీ సంఖ్యలో మొహరించారు. పట్టణ కేంద్రంలో ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టంచేశారు.
 
కాగా, ఏపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనలో భాగంగా కొత్తగా అమలాపురం జిల్లా కేంద్రంగా కోనసీమ పేరుతో జిల్లాను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఈ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చారు. దీన్ని ఓ వర్గం ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. మరోవర్గం నేతలు అంబేద్కర్ పేరును కొనసాగించాల్సిందేనంటూ పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు. 
 
దీంతో ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగి అవి ఘర్షణలకు దారితీశాయి. ఇవి అదుపుతప్పి హింసాత్మక చర్యలకు దారితీశాయి. ఫలితంగా అమలాపురంలోని రాష్ట్ర రవాణా శాఖామంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ గృహాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. బస్సులను దగ్ధం చేశారు. 
 
ఇదిలావుంటే అమలాపురంలో జరిగిన ఘటనలకు సంబంధించి ఏడు కేసులు నమోదు చేశామని, ఆందోళనకు కారకులైన వారిగా భావించే 46 మందిని అరెస్టు చేసినట్టు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. మరో 72 మంది అరెస్టుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లందరినీ అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు.