శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

అప్పుడు స్వాగతించి ఇపుడు వ్యతిరేకిస్తారా? మంత్రి విశ్వరూప్ ప్రశ్న

minister viswaroop
కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చడాన్ని స్వాగతించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఇపుడు వ్యతిరేకించడమేంటని ఏపీ రవాణా మంత్రి విశ్వరూప్ ప్రశ్నించారు. ఈ ఆందోళనకారులు తన ఇంటిని తగలబెట్టడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 
 
కోనసీమ జిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఆందోళనకారులు మంగళవారం ఆందోళనకు దిగారు. ఇవి చేయిదాటిపోవడంతో అమలాపురం తగలబడింది. ముఖ్యంగా, మంత్రి విశ్వరూపం, ఎమ్మెల్యే సతీష్ గృహాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దీంతో ఆ గృహాలు పూర్తిగా తగలబడిపోయాయి. 
 
ఈ దుశ్చర్యపై మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ, జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల అందరూ గర్వించాలని, ఒకవేళ పేరు మార్పుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. ఆ అభ్యంతరాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన స్పష్టం చేశారు. 
 
జిల్లాకు పేరు మార్పు నేపథ్యంలో కొన్ని రాజకీయ దుష్టశక్తులు యువతను రెచ్చగొడుతున్నాయని విశ్వరూప్ ఆరోపించారు. చేతులు జోడించి వేడుకుంటున్నానని, దయచేసి అందరూ సంయమనం పాటించాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.