శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (23:08 IST)

అమరావతి ప్రాంతం రాష్ట్రంలో అంతర్భాగం: మంత్రి బొత్స

అమరావతి ప్రాంతం రాష్ట్రంలో అంతర్భాగమని దానిని కూడా అభివృద్ధి చేసి చూపుతామని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

శాసన సభ ఆవరణలో గురువారం శాసన మండలి అభ్యర్ధి పెనుమత్స సూర్యనారాయణరాజు (సురేష్‌బాబు) నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు.ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి మెట్రోపాలిటిన్‌ ఏరియా డెవలప్‌ అథారిటీ (ఏఎంఆర్డిఏ) అంశంపై సమీక్ష నిర్వహించారని తెలిపారు.

అమరావతిలో ప్రస్తుతం ఏయేదశల్లో నిర్మాణాలు ఉన్నాయో అధికారులను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. నిధుల సమీకరణకు ప్రణాళిక సిద్ధంచేసుకోవాలని, ఆర్థిక శాఖ అధికారులతో కలిసి కూర్చుని ప్లాన్‌ చేసుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు.

హాపీ నెస్ట్‌ బిల్డింగులను పూర్తిచేయాలని సిఎం సూచించారన్నారు. వాటిని పూర్తిచేసే కార్యాచరణపై అధికారులతో సీఎం చర్చించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తుందని వెల్లడించారు.

అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ కృషి చేస్తున్నారని కొనియాడారు. అమరావతి ప్రాంతం ఈ రాష్ట్రంలో అంతర్భాగమేనని గుర్తు చేశారు. అమరావతి  ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ని దృష్టి లో పెట్టుకొని రైతులకు రిటన్ ప్లాట్లు ఇచ్చి ఆభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షం మొత్తం తామేనని మంత్రి చమత్కరించారు. చంద్రబాబు ప్రతిపక్ష బాధ్యతను విస్మరించారని విమర్శించారు. సీఆర్డిఏ చట్టం రద్దును, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించాకే శంఖు స్థాపన చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారని తెలిపారు.

ప్రతిపక్షాలు కోర్టు ద్వారా ప్రభుత్వ చర్యలకు అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిలో నిర్మాణ దశలో అసంపూర్తి భవనాలను పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రాంత రైతులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజలందరికీ నమ్మకం కలిగేలా అమరావతిని అభివృద్ధి చేసి చూపుతామని తెలిపారు.

అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూనే, అక్కడ నిర్మించిన భవనాలను ఏం‌ చేయాలి, ఎందుకు ఉపయోగించాల‌న్నది ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. ప్రతిపక్షం మాటలను నమ్మవద్దని, లేనిపోని అనుమానాలను పెట్టికోవద్దని ప్రజలకు మంత్రి సూచించారు. త్వరలో నూతన రాజధాని పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

రాష్ట్రంలో శుభకార్యాలు జరిగేటప్పుడు అందరికీ చెప్పి చేయడం హిందూ సాంప్రదాయమని మంత్రి అన్నారు. కార్యక్రమానికి దేశ ప్రధానమంత్రిని, దేశంలోని పెద్దలను అందరినీ పిలుస్తామని స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాల వారికి ఆహ్వాన పత్రాలను అందజేస్తామని మంత్రి వెల్లడించారు. సమావేశంలో మంత్రి వెంట ఎమ్మెల్యేలు కోరుముట్ల శ్రీనివాసులు, కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.