శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి

చకచకగా రాజధాని పనులు.. విశాఖ నుంచి పరిపాలనకు ముహూర్తం ఫిక్స్

దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఏపీ సీఎం జగన్ కలిసి వచ్చిన తరువాత పరిణామాలు చకచకగా మారిపోతున్నాయి. మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. విశాఖ నుంచి పరిపాలనకు ముహుర్తం కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖలో ముఖ్యమంత్రి పరిపాలనకి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. 
 
సీఎం రాకపోకలుకు సంబంధించి రోడ్డు మార్గాన్ని అధికారులు ప్రతిపాదించి.. ఆ మేరకు ప్రణాళికలు కూడా వేస్తున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచీ ఇటు మధురవాడ వరకూ రోడ్డు విస్తరణ, రోడ్డు నిర్మాణ పనుల్ని పరిశీలిస్తున్నారు. ప్రధానంగా సింహాచలం నుంచీ అడవివరం, ఆరిలోవ జంక్షన్ మీద నుంచీ మధురవాడ వరకూ ఉన్న మార్గంలో రోడ్డు పనులకు ఆలోచనలు చేస్తున్నారు. 
 
అలాగే రాజధాని మార్పులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్పోరేషనల్లో కమిషనర్లు, డెప్యూటీ కమిషనర్ల బదిలీలు చేసింది ఏపీ సర్కార్. గ్రేటర్‌ విశాఖ కార్పోరేషన్‌ కేంద్రంగా ఈ బదిలీలు చేసింది. విశాఖకు రాజధాని తరలిస్తారనే ప్రచారం జరుగుతోన్న సందర్భంలో జీవీఎంసీ కేంద్రంగా జరిగిన బదిలీలకు ప్రాధాన్యత సంతరించుకుంది. జీవీఎంసీ పరిధిలో వివిధ హోదాల్లో మార్పులు చేర్పులు చేసింది. జీవీఎంసీ డెప్యూటీ కమిషనర్‌గా నల్లనయ్యను నియమించిన సర్కార్… జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌గా వెంకట రమణను నియమించింది. అలాగే జీవీఎంసీ డీపీఓలుగా రమేష్‌ కుమార్‌, ఫణి రామ్‌ లను నియమించింది.
 
జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ పి. సింహాచలాన్ని పట్టణాభివృద్ది శాఖ కమిషనర్‌ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జీవీఎంసీ జోనల్‌ కమిషనర్ శ్రీరామ్‌ మూర్తి సొంత శాఖకు బదిలీ కాగా… జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ సీహెచ్‌ గోవింద రావును మాతృస్థానానికి బదిలీ అయ్యారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్‌ కార్యాలయానికి ఎన్‌. మల్లిఖార్జున్‌ బదిలీ కాగా… శ్రీకాకుళం మున్సిపల్‌ కమిషనర్‌గా ఓబులేసును నియమించింది సర్కార్.