మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 జూన్ 2021 (13:40 IST)

సీఎం జగన్ భేటీకి ముందు గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్యీలకు ఓకే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలికి మరో నలుగురు ఎమ్మెల్సీలు కొత్తగా నియమితులయ్యారు. వీరంతా గవర్నర్ కోటాలో ఎంపిక చేశారు. గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీల కోటాలో శాసనమండలికి నామినేట్ అయినవారిలో లేళ్ల అప్పిరెడ్డి, రమేశ్ యాదవ్, తోట త్రిమూర్తులు, మోషేన్ రాజులు ఉన్నారు. 
 
ఏపీలో 4 నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవులకు సంబంధించిన ఫైలుపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఏపీ సీఎం జగన్ ఈ సాయంత్రం సతీసమేతంగా రాజ్ భవన్‌కు తరలి వెళ్లి, గవర్నర్‌తో ఎమ్మెల్సీల అంశం చర్చించారు.
 
ప్రభుత్వం అంతకుముందే నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేయగా, ఫైలును ఆయన పెండింగులో ఉంచినట్టు తెలిసింది. సీఎం జగన్‌తో భేటీకి కొద్ది ముందుగా గవర్నర్ ఆ ఫైలుకు ఆమోదం తెలుపగా, గవర్నర్‌తో భేటీ అయిన సీఎం జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు. నామినేటెడ్ ఎమ్మెల్సీల పేర్లను గవర్నర్ ఆమోదించినట్టు రాజ్ భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.