గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2019 (18:13 IST)

రైతులకు శుభవార్త... కౌలు చెల్లించేందుకు నిధులు...

రాజధాని ప్రాంత రైతులకు ఏపీలోని వైకాపా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇచ్చే కౌలు డబ్బులు చెల్లించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం రూ.187.40 కోట్లను విడుదల చేసింది. ఈ నిధుల పంపిణీకి సీఆర్డీఏతో పాటు.. స్థానిక స్వపరిపాలనా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కోరింది. 
 
కౌలు చెల్లించాలంటూ గత కొద్దిరోజులుగా రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఆందోళనకు రాజకీయ పార్టీల మద్దతు కూడా లభించడంతో పరిస్థితి తీవ్రమైంది. దీంతో తక్షణమే రైతులకు కౌలు చెల్లించే ఏర్పాట్లు చేయాలంటూ సంబంధిత శాఖ మంత్రికి సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.
 
అదేసమయంలో ఇసుక‌పై స‌మీక్ష సంద‌ర్భంగా సీఎం జగన్ కీల‌క వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారని, వారిని ఎలా అడ్డుకోవాలో తెలుసునన్నారు. స్పందన కార్యక్రమం సహా, ఇసుక, ఇళ్ల పట్టాలు, పథకాల అమలుపై సంబంధిత శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష జరిపారు. 
 
ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలనుద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు మంచి చేస్తే చూడలేక బాధపడిపోతున్నారని విపక్షాలనుద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేశారు. సమస్యల పరిష్కారం, సహా ఇతర అంశాలలో ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులో ఉంచుకోవాలంటూ మంత్రులు, అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.