శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 ఆగస్టు 2019 (15:18 IST)

మూడు నెలల్లోనే ఏపీ పాలన తిరోగమనం : కళా వెంకట్రావు

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన కేవలం మూడు నెలల్లోనే ఏపీ పాలన తిరోగమనంలో పయనిస్తుందని టీడీపీ ఏపీ శాఖ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం వచ్చాక రద్దుల ప్రభుత్వంగా, మార్పుల ప్రభుత్వంగా, ఆమలుకాని హామీలు ఇచ్చిన ప్రభుత్వంగా మారిపోయిందన్నారు. 
 
రాష్ట్ర అభివృద్ధితో సీఎం జగన్, వైసీపీ నేతలు ఆటలు ఆడుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజధానికి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినప్పుడు ప్రపంచ బ్యాంకులు వచ్చి మద్దతు పలికాయి. సీఎం జగన్ అయ్యాక బ్యాంకులు వెనక్కి వెళ్లిపోయాయని గుర్తుచేశారు. 
 
గత 90 రోజుల జగన్ పాలనలో సామాన్యులు బాధపడుతున్నారు. 3 నెలల పాలనలో రాష్ట్రం 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకోకుండా జగన్ వ్యవహరిస్తున్నారు. పనులు ప్రారంభమయ్యేసరికి మరో 9 నెలలు పడుతుంది. ఖర్చు కూడా పెరుగుతోంది. రాజధానికి తూట్లు పొడవడం మంచిది కాదు. 
 
అన్ని ప్రాంతాలకు అనువైన ప్రాంతం అమరావతి. బందరు పోర్టు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రపంచస్థాయి రాజధాని ఏర్పాటు విషయంలో ముఖ్యమంత్రి మౌనం మంచిది కాదు. అభివృద్ధి కోసం అధికారంలో ఉన్న వారు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందన్నారు. 
 
పూలింగ్ విధానంలో 30 వేల ఎకరాలు రైతులు ఇచ్చారు. ఆ రైతులను సీఎం జగన్ ఇబ్బంది పెట్టకూడదు. ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం ఉండాలి. చిన్న పిల్లల ఆటలు ఆడుకుంటున్నట్లు, ప్రభుత్వ పెద్దలు ఉండడం పద్దతి కాదు. ఇసుక మీద, నాటుసారా మీద, రాజధాని రద్దు మీద, టెండర్ల మీద వున్న దృష్టి ప్రజల కష్టాలుపై తీర్చాలని ఈ ప్రభుత్వానికి లేదు.

రివర్స్‌లో ఈ ప్రభుత్వం ప్రయాణం జరుగుతుంది. వరదలు కూడా ఈ ప్రభుత్వం సృష్టి. రాయలసీమ ప్రాంతానికి అవసరమైన నీరు పంపితే అమరావతికి వరదలు రావని కళా వెంకట్రావు ఆరోపించారు.