#JaganinUsA hashtag on Twitter : డల్లాస్ సభలో జరిగిన తప్పులకు బాధ్యులు ఎవరు?
జననేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాకరాక మొట్టమొదటిసారిగా అమెరికా వచ్చారు. అదీ సీఎం హోదాలో. సభకి జనం బాగానే వచ్చారు. భోజనాలు బాగానే పెట్టారు. జగన్ స్పీచ్ అదరహో. జనం, ఫుడ్, స్పీచ్ విషయంలో నూటికి నూరు మార్కులు. ఈ మూడు తప్ప మిగిలిన విషయాలలో ఆర్గనైజర్లు పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. నాయకత్వం అనేది ఎప్పుడు ఒకరే చెయ్యాలి. ఒకే పనికి పది మంది నాయకులు ఉంటే ఫలితం ఎలా ఉంటుందో చూశాం.
గత పదేళ్లుగా అమెరికాలో పార్టీ కోసం కష్టపడిన వారిని ఒక్కరిని కూడా జగన్‌ని కలిసే భాగ్యం కలిగించకుండా చేశారు. పార్టీ ఫండ్స్ ఇచ్చినవారిని కూడా కలవకుండా చేశారు. కమ్యూనిటీ పెద్దలకు తీవ్రమైన అవమానం జరిగింది. ఉదాహరణకు, జగన్ కాసేపు ఉన్న హోటల్ సూట్ దగ్గర లక్కిరెడ్డి హనిమిరెడ్డి ఒక గంట సేపు నిలబడి వేచివున్నారు. అయన వయసు 70. అక్కడే తిరుగుతున్న మహిళా ఎన్నారై కన్వీనర్ ఆయనను చూసి కూడా పట్టించుకోకుండా ఆమె చుట్టాలను లోపలకి తీసుకువెళ్లారు. పార్టీ కోసం కష్టపడినవాళ్ళని కాదని ఎవరెవరినో లోపలికి తీసుకువెళ్లి జగన్‌ని చూపించారు.
స్టేజి మీద లక్కిరెడ్డికి కుర్చీ వేసి కూర్చోబెట్టి, మళ్ళీ ఆయనను లేపి, కుర్చీ తీసివేసి ఆయనను స్టేజికి ఒక్క పక్క నిలబెట్టారు. దాదాపు గంట పాటు. తరవాత ఆయన అక్కడినుండి వెళ్లిపోయారు. తెలుగుపెద్ద అయినా పైళ్ల మల్లారెడ్డికి జనరల్ సీటింగ్‌లో ఎవరో లేచి కుర్చీ ఇస్తే కూర్చున్నారు. ఆటా హనుమంత రెడ్డి పరిస్థితి కూడా ఇదే. చిన్న పెద్ద తెలుగు కమ్యూనిటీ నాయకులూ మొత్తం తీవ్రమైన నిరాశకు గురై, అసహనం, కోపం వ్యక్తం చేశారు. ఇది మన ఆర్గనైజర్ల పనితనం. నేటి అమెరికా కుర్ర నాయకులకు పెద్దలంటే గౌరవం ఏమాత్రం లేదు.
అమెరికాకి ఐదుగురు కన్వెనేర్లు. వీళ్ళు కాక ఇటీవల ఒక కీలక పదవి చేపట్టిన ఆకేపాటి వెంకన్న. ఇండియా నుండి వచ్చిన చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే, అందరూ కలసి హడావుడి చేసి చాలా దరిద్రంగా ఆర్గనైజ్ చేసారు. వీళ్ళందరికీ ఇండియా నుండి సూచన చేసి, ఈ విధంగా అందరిని అవమాన పడేలా చేసిన ఘనత మాత్రం, పార్టీలో నెంబర్ 2 అయిన రాజ్యసభ సభ్యునికి చెందుతుంది. అయన సూచన మేరకే పైన చెప్పిన వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు. హుందా తనం కోల్పోయి, పిల్ల చేష్టలుగా చేసారు. ఎన్నారై కమిటీలో ఉన్న సభ్యలకు ఒక పద్దతి ప్రకారం ట్యాగ్‌లు ఇవ్వలేదు. అసలు ఏ ట్యాగ్, ఎక్కడ ఇస్తున్నారో, ఎవరు ఇస్తున్నారో తెలియదు.
వీవీఐపీ ట్యాగ్‌లకు వైట్ కలర్ పెట్టారు. జనాలు వాల్మాట్‌కి వెళ్లి వైట్ కలర్ ట్యాగ్‌లు కొని తెచ్చుకున్నారు. 25 ట్యాగ్‌ల కోసం, రెండు రోజులు ప్రేమ్ రెడ్డితో గొడవ పడ్డారు ఆర్గనైజర్లు. చివరికి 500 మంది దగ్గర వీవీఐపీ ట్యాగ్‌లు ఉన్నాయి. 10 లక్షల పైన డొనేట్ చేసిన వారికి ఫోటో అన్నారు. చివరికి ఏమీ లేదు. వందల డాలర్లు ఖర్చు పెట్టుకొని దేశం నలుమూలల నుండి వచ్చిన అభిమానులు, పార్టీ కోసం పని చేసిన వాళ్ళు లోలోపల కుతకుత లాడిపోతున్నారు. చాలా మంది పడ్డ బాధను చూసి ఈమెయిల్ రాస్తున్నాను. ఈ మెయిల్ నూటికి నూరు శాతం జగన్ గారు చదువుతారు. మీకు బుద్ది చెబుతారు.