1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 డిశెంబరు 2021 (13:05 IST)

ఆర్టీసీ బస్సులపై పసుపు రంగు.. తొలగించాలని ఆర్టీసీ నిర్ణయం

మూలిగే నక్కపై తాటిపండుపడిన చందంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ పరిస్థితివుంది. ఇప్పటికే పీకల్లోతు అప్పుల ఊబిలో వుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. అయినప్పటికీ నష్టాల గండం నుంచి గట్టెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్టీసీలో దుబారా ఖర్చులు తగ్గించాలని పై అధికారుల నుంచి కింది స్థాయి అధికారులకు ఆదేశాలు వచ్చాయి. ఇంతవరకు బాగానే వుంది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే పల్లె వెలుగు బస్సులపై పసుపు రంగు ఉంది. దీన్ని తొలగించాలని ఏపీఎస్ ఆర్టీసీ ఇపుడు నిర్ణయించడం విడ్డూరంగా వుంది. ప్రస్తుతం ఈ పల్లె వెలుగు బస్సులపై ఆకుపచ్చ, పసుపు, తెలుగు, నలుపు రంగులు ఉన్నాయి. కానీ, పసుపు రంగు స్థానంలో గచ్చకాయ రంగును వేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. అలాగే, బస్సులపై ఉండే డిజైన్‌ను కూడా మార్చబోతున్నారు 
 
కాగా, ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, బడులకు, గ్రామ పంచాయతీ భవనాలను ఆ పార్టీ జెండా గుర్తులోని రంగులను వేసిన విషయం తెల్సిందే. ఈ రంగుల వ్యవహారం హైకోర్టు చేరింది. కోర్టు అక్షింతలతో ఈ రంగులను మార్చారు. ఇపుడు మళ్లీ ఆర్టీసీ బస్సులపై ఉండే రంగులను మార్చాలని అధికారులు నిర్ణయించడం విడ్డూరంగా వుందనే కామెంట్స్ వస్తున్నాయి. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఈ రంగుల మార్పు అదనపు భారం కాదా అని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.