శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 మే 2020 (16:41 IST)

కరోనా కష్టాలు : 6 వేల ఔట్‌ సోర్సింగ్ ఉద్యోగులపై ఏపీఎస్ఆర్టీసీ వేటు

ఇటీవల ప్రభుత్వ సంస్థగా మారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కరోనా కష్టకాలంలో తేరుకోలేని షాకిచ్చింది. ఏకంగా 6 వేల మంది ఉద్యోగులు విధులకు రావొద్దంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ ఉత్తర్వులను ఆయా మేనేజర్ల ద్వారా జారీ చేయించింది. అదీకూడా మే 15వ తేదీ శుక్రవారం నుంచే హాజరుకావొద్దంటూ అందులో పేర్కొన్నారు. 
 
ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఉద్యోగులందరినీ తొలగించామని ఆర్టీసీ డిపో మేనేజర్లు సెలవిస్తున్నారు. ఈ నిర్ణయంపై కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. ఆర్టీసీ యాజమాన్య తీరును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించాయి. 
 
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకాశి, కార్యదర్శి నూర్ మొహమ్మద్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కాగా, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇంతవరకు ఏప్రిల్ నెల వేతనాలు కూడా చెల్లించలేదు.