బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 మార్చి 2024 (12:25 IST)

వామ్మో... ఎన్నికల పోలింగ్‌కు అన్ని రోజులా...? అభ్యర్థుల్లో వెన్నులో వణుకు...!!

election commission
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మే 13వ తేదీన ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అయితే, నోటిఫికేషన్‌కు పోలింగ్‌కు ఏకంగా 59 రోజులు విరామం ఉంది. ఈ విరామ సమయం అభ్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఈసీ ప్రకటించిన ఎన్నిక షెడ్యూల్‌లో పోలింగ్ తేదీ ఏకంగా 59 రోజులు ఉండటంతో.. 'అమ్మో.. అన్ని రోజులా’ అని అభ్యర్థులు కలవరపడుతున్నారు. 
 
సాధారణంగా దక్షిణాదిలో ఎన్నికలంటేనే కోట్లాది రూపాయలు ఖర్చు చేయాలి. గత ఏడాది మే నెలలో జరిగిన కర్ణాటక, డిసెంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలోనే అత్యధికంగా వందల కోట్ల రూపాయలు తనిఖీల్లో పట్టుబడ్డాయి. ఏపీలోనూ ఇదే స్థాయిలో అభ్యర్థులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. షెడ్యూల్ వెలువడిన మార్చి 16వ తేదీ నుంచి పోలింగ్ జరిగే మే 13 వరకూ అనుచరులు, కార్యకర్తల్ని అభ్యర్థులు భరించాలంటే... భారీగా ఖర్చు చేయాల్సిందే. 
 
ప్రతి రోజూ కనీసం రూ.5 లక్షల నుంచి సభలు, ఇతరత్రా కార్యక్రమాలను బట్టి 25 నుంచి 30 లక్షల రూపాయలు వరకూ ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి. అలా చెయ్యకపోతే వెంట నడిచేవారు కూడా జారిపోతారని భయం. భోజనాలు, వాహనాలు, డీజేలు, ఫ్లెక్సీలు, కళాకారులు... ఒకటా రెండా ప్రతి రోజూ ఖర్చు చేస్తూనే ఉండాలి. కాగా, లోక్‌సభకు, 4 రాష్ట్రాల అసెంబ్లీలకు, ఉప ఎన్నిక స్థానాలకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో నాలుగో విడతలో, మే 13న రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. 
 
గత 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో షెడ్యూల్‌కు (మార్చి 10) పోలింగ్‌కు (ఏప్రిల్ 11) మధ్య 33 రోజులు ఉంది. అప్పట్లో గెలుపు, ఓటమిపై టెన్షన్ తప్ప వేరే బాదరబందీలుగా లేవని వివిధ రాజకీయ పార్టీల నేతలు గుర్తుచేసుకుంటున్నారు. పోలింగ్ తర్వాత 53 రోజులకు ఫలితాలు వెలువడ్డాయి. అంతకాలం ఎదురుచూడటం అప్పట్లో తమకు ఇబ్బంది కలిగించలేదని చెబుతున్నారు. కానీ, ఈసారి అలా కాదు. పోలింగ్‌‍కు ముందే 59 రోజులపాటు డబ్బులు నీళ్లలా ఖర్చు చేయాల్సి రావడం మోయలేని భారం అంటున్నారు.