గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 ఆగస్టు 2024 (12:57 IST)

ఏపీ మంత్రులందరికీ ఐ-ప్యాడ్లు... ఇకపై ఈ-క్యాబినెట్ సమావేశాలు...

chandrababu
ఎల్లవేళలా వినూత్నంగా ఆలోచన చేసే టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సమావేశాల నిర్వహణపై ఆయన వైవిధ్యంగా ఆలోచన చేశారు. ఇకపై నిర్వహించే మంత్రిమండలి సమావేశాలన్నీ ఈ-క్యాబినెట్ రూపంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం మంత్రులందరికీ ఐప్యాడ్లు అందజేసి తగిన శిక్షణ ఇవ్వాలని ఆయన కోరారు. 
 
ఇటీవలే జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ఇకపై జరిగే క్యాబినెట్ సమావేశాలన్నీ కాగిత రహిత విధానంలో జరుగుతాయని మంత్రులకు తెలిపారు. చంద్రబాబు తొలుత 2014లో ఇ-క్యాబినెట్ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విధానాన్ని పక్కనబెట్టింది.
 
క్యాబినెట్ సమావేశం అంటే చాలు... ఆయా అంశాల ఆధారంగా అధికారులు కనీసం 40 సెట్ల పత్రాలను ముద్రించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు కాగిత రహిత ఇ-క్యాబినెట్ సమావేశాల్లో ఆ పరిస్థితి కనిపించదు. ఎంచక్కా, మంత్రుల ఐప్యాడ్లకే సమావేశం అజెండా వివరాలన్నీ అప్ లోడ్ చేస్తారు.
 
ఈ విధమైన హైటెక్ క్యాబినెట్ సమావేశాలతో పెద్ద మొత్తంలో ప్రింటింగ్ ఖర్చులు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా, క్యాబినెట్ నోట్స్ బయటికి లీక్ కాకుండా ఇ-క్యాబినెట్ విధానం ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది.