గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 అక్టోబరు 2021 (19:15 IST)

YS వివేకా కేసులో CBI చార్జ్‌షీట్: హత్యకు ఆ నలుగురే కారణమంటూ..?

2019 ఎన్నికల ముందు ఏపీ రాజకీయాల్లో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. మార్చి 15, 2019న పులివెందులలోని ఆయన స్వగృహంలోనే అనుమానాస్పద స్థితిలో వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెందారు. మొదట గుండెపోటుతో ఆయన మరణించారని ప్రచారం జరగ్గా.. తర్వాత హత్య అని పోలీసులు తేల్చారు. అప్పట్నుంచి ఈ కేసుల పలు మలుపులు తిరిగింది. 
 
చివరగా.. వైఎస్ వివేకా కుమార్తె సునీత పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. 2020 మార్చి 11న కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. మూడు నెలలు ఆలస్యంగా జులై19, 2020న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. 
 
కరోనా అవాంతరాల మధ్య కేసు విచారణ సుదీర్ఘంగా సాగింది. 2021 ఏప్రిల్‌లో ఢిల్లీలో సీబీఐ అధికారులను కలిసిన వివేకా కూతురు సునీత..  రెండేళ్లు అయినా కేసులో పురోగతి లేదని, వేగంగా దర్యాప్తు జరపాలని కోరింది. ఫైనల్‌గా సీబీఐ ఫస్ట్ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
 
ఈ నేపథ్యంలో వైఎస్ వివేకా హత్యకు నలుగురు కారణమని సీబీఐ అధికారులు అభియోగం సమర్పించారు. ఈ మేరకు వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ పులివెందుల కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరిలను సీబీఐ నిందితులుగా పేర్కొంది. వివేకా మృతికి ఈ నలుగురే కారణమంటూ.. అభియోగపత్రం సమర్పించారు అధికారులు. 
 
ఆగస్ట్, సెప్టెంబర్‌లోనే నిందితులను అరెస్ట్ చేసి జైలులో ఉంచినట్టు పులివెందుల కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. నిందితుల్లో ఇద్దరు ప్రస్తుతం కడప జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారని.. మరో ఇద్దరు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు పేర్కొంది.