1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 23 జనవరి 2022 (14:49 IST)

కొత్త పీఆర్సీ ఆమలుకు జీవో జారీచేసిన ఏపీ సర్కారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొత్త పీఆర్సీని అమలు చేసేలా ఆదివారం కొత్త జీవోను జారీచేసింది. అయితే, ఈ కొత్త పీఆర్సీ అమలును ప్రభుత్వం ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా కొత్త పీఆర్సీను చేస్తూ జీవో జారీ చేసింది. దీంతో వచ్చే నెల కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాలు చెల్లించనున్నారు. 
 
ఏపీ ప్రభుత్వం ఇటీవల కొత్త పీఆర్సీని ప్రకటించింది. అయితే, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, చర్చలు పూర్తయ్యేంత వరకు పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు చెల్లించాలంటూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కూడా కలిసి వినతి పత్రం సమర్పించారు. పైగా, ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి సమ్మె చేయనున్నట్టు ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో కొత్త పీఆర్సీ ప్రకారం వేతన బిల్లులు ఇవ్వాలని వైకాపా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు కొత్త పీఆర్సీ అమల్లోకి వచ్చిందని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ ఉత్తర్వులు జారీచేశారు. 
 
ట్రెజరీ డైరెక్టర్, ట్రెజరీ అధికారులు పీఆర్సీ అమలుపై దృష్టి సారించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీలోపు వేతన బిల్లులు రూపొందించి సీఎఫ్ఎంఎస్‌కు పంపాలని స్పష్టం చేశారు. అలాగే, ప్రతి రోజూ పురోగతిపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ నివేదిక అందించాలని ఆదేశించారు.