మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 19 జనవరి 2022 (10:53 IST)

శుభవార్త చెప్పిన ఏపీ సర్కారు.. కరోనా పరీక్ష ధరలు తగ్గింపు

ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు వసూలు చేసే ధరలను తగ్గించింది. ఐసీఎంఆర్ గుర్తింపు కలిగిన ఎన్.ఏ.బి.ఎల్ ప్రైవేట్ ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్ ధరను రూ.350గా నిర్ణయించింది. 
 
గతంలో ప్రభుత్వం పంపే ఆర్టీపీసీఆర్ శాంపిళ్లను పరీక్షించేందుకు ఒక్కో టెస్టుకు రూ.475, ఎన్.ఏ.బి.ఎల్ ల్యాబ్‌లో అయితే రూ.499 చొప్పున ధరలు ఉండేవి. ప్రస్తుతం ఈ ధరలను రూ.350గా నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది. 
 
ఈ మేరకు సవరించిన ధరలను అన్ని ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు తప్పనిసరిగా వసూలు చేయాలని, ఈ సవరించిన రేట్ల ధరల పట్టికను ఆస్పత్రుల్లో ప్రదర్శించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఈ సవరించిన ధరలను మాత్రమే వసూలు చేయాలని, ఎవరైనా అధికధరను వసూలు చేస్తే మాత్రం ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరింది. ఈ మేరకు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది. 
 
మరోవైపు, కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా, ఈ నెల 31వ తేదీ వరకు రాత్రిపూట కర్ఫ్యూను ప్రభుత్వం అమలు చేయనుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారి నుంచి రూ.100 వసూలు చేస్తారు.