ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2022 (12:42 IST)

వైకాపా సర్కారు మరో బాదుడు.. ఫ్యాన్సీ నంబర్ల ధరలు పెంపు

fancy numbers
ఏపీలోని వైకాపా ప్రభుత్వం మరోమారు బాదుడు శ్రీకారం చుట్టింది. వాహనదారులు ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసే ఫ్యాన్సీ నంబర్ల ధరలను ఒక్కసారిగా పెంచేసింది. ఈ పెంచిన ఫ్యాన్సీ నంబర్ల ధరలు కూడా అమల్లోకి తెచ్చేసింది. దీనికి సంబంధించి వాహన చట్టానికి సవరణ చేస్తూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 
 
ఏపీలోని ఇతర జిల్లాలతో పోల్చితే విశాఖ జిల్లాలో ఫ్యాన్సీ నెంబర్ల మోజు చాలా ఎక్కువ. సెంటిమెంట్‌గా భావించే వారు కావాల్సిన నెంబర్‌ను కొనుగోలు చేసేందుకు ఇక నుంచి భారీగా డబ్బులు చెల్లించాల్సిందే. 
 
అయితే ఒకేసారిగా పాత ధరలను మించి మూడు, నాలుగింతలు పెంచడం, రాష్ట్ర వ్యాప్త పోటీ కారణంగా సామాన్యులకు భారంగా మారనుందన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. 
 
అత్యంత ప్రాధాన్యత ఉన్న 9999 నెంబర్‌కు రూ.50 వేల నుంచి రూ.2 లక్షలకు ఫీజు పెంచారు. అలాగే, 1, 9, 999 నెంబర్లకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. 
 
రాష్ట్రంలో 2019 నుంచి ఏపీ 39 సిరీస్‌ వచ్చింది. ఒక సిరీస్‌తోనే రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్‌ జరగడంతో ఆ సిరీస్‌ నెంబర్లు త్వరగా అందుబాటులోకి వస్తున్నాయి. 
 
పాత పద్ధతిలో ఫ్యాన్సీ నెంబర్ల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. మూడు, నాలుగు రోజుల్లోనే పలుమార్లు బిడ్‌ వేసి కావాల్సిన నెంబర్‌ను దక్కించుకోగలుగుతున్నారు. దీంతో ప్రభుత్వానికి కూడా భారీగా ఆదాయం పెరిగింది. 
 
గతంలో డిమాండ్‌ను బట్టి 150 నెంబర్ల వరకు ఫ్యాన్సీ నెంబర్లుగా గుర్తించి ప్రభుత్వం వాటికి రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలుగా నాలుగు విభాలుగా ఫీజులు పెట్టింది. 
 
ప్రస్తుతం అవే నెంబర్లకు రూ.2 లక్షలు, రూ.లక్ష, రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేల చొప్పున ఏడు విభాగాలుగా మార్చింది.
 
ఫ్యాన్సీ నంబర్లకు పెంచిన ధరలిలా..  
9999 నంబరు ధర రూ.2 లక్షలు 1, 9, 999 - రూ.లక్ష 99, 3333, 4444, 5555, 6666, 7777 ధర రూ.50 వేలు 
5, 6, 7, 333, 369, 555, 666, 777, 1111, 1116, 1234, 2277, 3339, 3366, 3456, 3699, 3939, 4455, 4545, 4599, 6669, 6789, 8055, 8888 నంబర్ల ధరలు రూ.30 వేలు 3, 111, 123, 234, 567, 1188, 1818, 1899, 1999, 2222, 2799, 3636, 3999, 5678, 5999, 6999, 7999, 9009 నంబర్ల ధరలు రూ.20 వేలు.