సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 26 జులై 2019 (17:46 IST)

మన చేతుల్లోనే స్మార్ట్ ఫోన్ రూపంలో శత్రువులు : హోం మంత్రి సుచరిత

సైబర్ నేరాల రూపంలో శత్రువులుగా స్మార్ట్ ఫోన్లు మన చేతుల్లోనే ఉన్నాయని హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శుక్రవారం ఉద‌యం వెలగపూడి సచివాలయంలోని 5వ బ్లాక్‌లో విమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్ (సైబర్ ప్రదేశంలో మహిళల భద్రత) కార్యశాలలో భాగంగా రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా  హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ, భారతదేశంలో తొలిసారిగా సైబర్ ప్రదేశంలో మహిళల భద్రత అనే అంశంపై మహిళా మంత్రులు, మహిళా శాసన సభ్యులు, మహిళా అధికారులు, ప్రతినిధులతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన వల్ల, డిజిపి ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ఇటువంటి కార్యక్రమం రూపొందించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నామన్నారు. 
 
నేటి ఆధునికయుగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంతో అభివృద్ధి చెందుతోంది. వాటి నేపథ్యంలో మహిళలు, బాలికలు, విద్యార్థులు లక్ష్యంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయన్నారు. స్మార్ట్ ఫోన్లు వచ్చాక మంచి, చెడు రెండూ కూడా సెకన్ల వ్యవధిలో ఒకరి నుంచి మరొకరికి సమాచారం చేరిపోతున్నాయన్నారు. ఆ విధానంలోనే సైబర్ నేరాల సంఖ్య కూడా సమాజంలో గణనీయంగా పెరిగి పోతున్నాయన్నారు. మహిళలు, బాలికలు లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు దృష్టి పెడుతున్నారు. 
 
సోషల్ మీడియాను వాడే మహిళలు, విద్యార్థులు, పిల్లలు ఎక్కువగా బాధితులు అవుతున్నారన్నారు. మహిళల ఫోన్లలోని వ్యక్తిగత సమాచారానన్ని దొంగిలిస్తున్నారు మన స్మార్ట్ ఫోన్ మన వద్దే ఉన్నా "స్పై యాప్ " ద్వారా అందులో సమాచారం సైబర్ నేరగాళ్లకు వెళ్తోందన్నారు. సైబర్‌పై అవగాహన లేకపోవడం, మహిళలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అనర్ధాలు జరుగుతున్నాయన్నారు. కొందరు సెల్ ఫోన్ రిపేరీ కేంద్రాల నిర్వాహకులు సెల్ఫోన్ రిపేరీకి ఇచ్చినపుడు వారికి తెలియకుండా వాటిలో "స్పై ఆప్"‌లు పెడుతున్నారని సుచరిత తెలిపారు. 
 
వీటి ద్వారా మహిళల వ్యక్తిగత సమాచారాన్ని క్షణాల్లో నేరగాళ్ల చేతుల్లోకి వెళుతున్నాయి. ఫొటోలు మార్ఫింగ్ చేయడం సహా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా, ఫేస్‌బుక్‌లు ఇతర మాద్యమాల్లో ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెట్టి స్నేహం చేసి మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు. అవగాహన లేనందున సైబర్ నేరాల వల్ల మహిళలు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారన్నారు. గృహిణులు  విద్యార్థినులు ఎక్కువగా బాధితులు అవుతున్నారు. టెక్నాలజి వల్ల ప్రయోజనాలు ఉన్నా.. అనర్థాలు అంతకంటే వేగంగా పెరగడం ఆందోళనకరం కలిగిస్తోందన్నారు. 
 
నేరాల బారినపడకుండా ఉండాలన్న దృక్ఫథంతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో మహిళల భద్రత పెంచాలన్న సదుద్దేశంతో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుంటామని, ప్రతిఒక్కరి సహకారం కావాలని సుచరిత కోరారు. మహిళలల్లో, ప్రజల్లో అవగాహనకు ఇది ప్రారంభం మాత్రమేనని, ఈ ప్రచారాన్ని మరింత పటిష్టపరిచి ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చెయ్యడం జరుగుతుందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఉపయోగం ఉండాలి ఇలా ఆత్మహత్యలు గురికాకుదన్నారు.
 
మహిళల భద్రత విషయమై చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నామని డిజిపి గౌతమ్ సవాంగ్ అన్నారు. భవిష్యత్తులో మహిళలు పోలీసు స్టేషన్ల వరకు రాకుండానే న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళలు స్టేషన్‌కు రాకుండానే కంప్లైంట్ చేసే అవకాశాన్ని కల్పిస్తామని తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇప్పటికే మహిళల, బాలికల భద్రత కోసం పోలీసు శాఖ పరంగా చాలా చర్యలు తీసుకున్నామన్నారు. 
 
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సైబర్ నేరాల నుంచి మహిళలకు, బాలికలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా మరిన్ని చర్యలు తీసుకోవాలని, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాల్సి ఉందన్నారు. సైబర్ నేరాల నుంచి మహిళల రక్షణకు ఇంకా ఏంమేం  చేయాలనే అంశంపై చర్చించడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మన్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారన్నారు. రాష్ట్రానికి మహిళ హోం మంత్రి ని సీఎం నియమించి మహిళలకు  తాము ఇస్తున్న ప్రాధాన్యత తెలియజేశారన్నారు. రానున్న రోజుల్లో సైబర్ నేరాల నుంచి మహిళల భద్రత కోసం మరిన్ని చర్యలు తీసుకుంటాన్నారు. 
 
స్పెషల్ చీఫ్ సెక్రెటరీ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ, సైబర్ నేరాలను నియంత్రణకు ఐటీ చట్టాలను మరింత పటిష్ట పరచాల్సి ఉందన్నారు. యూఎస్ఏ, తదితర దేశాల్లో చట్టాలను అత్యంత పకడ్బందీగా రూపొందించరన్నారు. ఆన్లైన్ సైబర్ నేరాలపై ప్రజల్లో మరింతగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందుకోసం సంస్థాగత నిర్మాణం చెప్పాట్టాలని సూచించారు. ఇందులో ముఖ్యంగా మహిళలను, బాలికలను భాగస్వామ్యం చేయలన్నారు. 
 
సైబర్ నేరాలు, సెక్యురిటీపరంగా తీసుకోవాలసిన జాగ్రత్తలపై ఈ ఎస్ ఎఫ్ ల్యాబ్ వ్యవస్థాపకుడు అనిశెట్టి అనిల్ అవగాహన కల్పించారు. స్మార్ట్ ఫోన్, లాప్ టాప్ , కంప్యూటర్‌లలో మంచి యాంటీ వైరస్‌ను పెట్టుకోవాలని, వెబ్‌కామ్‌పై వినియోగించని సమయంలో స్టికర్ అతికించుకోవలన్నారు. పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మర్చికొని, గోప్యంగా ఉంచుకోవడం ముఖ్యమన్నారు. అనంతరం సైబర్ సేఫ్టీ ఫర్ విమెన్ అండ్ చైల్డ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు.