గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (15:40 IST)

ఇక్కడ స్కూలు టీచరుకు - అక్కడ విద్యార్థికి కరోనా ... సర్వత్రా ఆందోళన...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ తర్వాత తిరిగి పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. గత కొన్ని నెలలుగా మూతపడిన పాఠశాలలు, కాలేజీల తలుపులు తెరుచుకుంటున్నాయి. తాజాగా నవంబర్ 2 నుంచి పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. 
 
ఇదే ప్రకాశం జిల్లాలోని ఓ స్కూళ్లో విద్యార్థుల తల్లిదండ్రలను భయాందోళనకు నెట్టేసింది. జిల్లాలోని హనుమంతునిపాడు మండలం గొల్లపల్లి స్కూల్‌లో ఓ ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 
 
దీంతో స్కూల్‌లోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అధికారులు హుటాహుటిన కరోనా టెస్టులు చేయిస్తున్నారు. ఉపాధ్యాయునికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు.
 
మరోవైపు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కూడా సుమారుగా 7 నెలల తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే, స్కూల్స్ తెరిచిన తొలిరోజే, ఓ విద్యార్థికి కరోనా సోకడంతో ఉత్తరాఖండ్‌లోని రాణిఖేట్ పట్టణంలో కలకలం రేపింది. ఇక్కడి ఓ పాఠశాలకు తొలిరోజు వచ్చిన విద్యార్థికి కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో, అతనితో పాటు గదిలో కూర్చున్న 15 మందినీ అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.
 
ఈ విషయాన్ని వెల్లడించిన రాష్ట్ర కొవిడ్ కంట్రోల్ రూమ్ నోడల్ అధికారి జేసీ పాండే, పాఠశాలను మూడు రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించామని, స్కూల్ గదులు, ఆవరణను శానిటైజ్ చేయనున్నామని అన్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 3941 పాజిటివ్ కేసులు ఉన్నాయి.