ఆర్థిక సమస్యలు, కరోనా ఇబ్బందులు చుట్టుముట్టినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు.
దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా పారిశ్రామిక రంగ ఆర్థిక పరిపుష్ఠికి అవసరమైన చర్యలకు సీఎం శ్రీకారం చుట్టారని మంత్రి స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం విజయవాడలోని రోడ్లు భవనాల శాఖ కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
పరిశ్రమలలో పని చేసే కార్మికులను కోవిడ్ –19 ప్రభావం నుంచి కాపాడేందుకు అవసరమైన ముందస్తు చర్యలను చేపడతున్నామని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రోత్సాహకాలు, బకాయిలు, విద్యుత్ ఛార్జీల వంటి కీలక అంశాలన్నింటిలో పరిశ్రమలకు ఉపశమనం కలిగించే నిర్ణయాలతో రాష్ట్ర పారిశ్రామిక రంగం ఉత్తేజంతో తిరిగి పట్టాలకెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని మంత్రి వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కీలక సమీక్ష నిర్వహించిన అనంతరం సమీక్షా సమావేశంలోని నిర్ణయాలను, ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి గౌతమ్ రెడ్డి మీడియాకు వివరించారు.
ఎమ్ఎస్ఎమ్ఈలకు భరోసానిచ్చే కచ్చితమైన ఆర్థికరక్షణ ప్రణాళిక అమలుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం మంచిపరిణామమని మంత్రి తెలిపారు. గత ఐదేళ్లలోనూ చెల్లించని ప్రోత్సాహకాల బకాయిలను చెల్లించే నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ఎమ్ఎస్ఎమ్ఈలకు ఉపశమనమిచ్చే నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు.
2014–15 నుంచి 2018-2019 మధ్యకాలంలో మొత్తం ఎమ్ఎస్ఎమ్ఈ ప్రోత్సాహక బకాయిలు రూ. 828 కోట్లు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019–20 ఎంఎస్‌ఈలకు ( అప్‌లోడ్ చేసిన వివరాల ప్రకారం) బకాయిలు రూ. 77 కోట్లు కలిపి మొత్తంగా రూ.905 కోట్లను మే, జూన్ నెలలో ఎంఎస్‌ఎంఈలకు ఇస్తామని సీఎం ప్రకటించినట్లు మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. విడతల వారీగా మే నెలలో సగం, జూన్ నెలలో మరో సగం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
ఎమ్ఎస్‌ఎమ్ఈల మినిమం కరెంటు డిమాండ్ ఛార్జీల రద్దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి స్పష్టం చేశారు. ఏప్రిల్, మే, జూన్.. ఈ మూడు నెలల కాలంలో ఎమ్ఎస్ఎమ్ఈలకు పవర్ డిమాండ్ ఛార్జీలు రూ. 188 కోట్లు మాఫీ చేయనున్నామన్నారు. మిగిలిన పరిశ్రమలకు మూడు నెలల (ఏప్రిల్, మే, జూన్ )కరెంటు మినిమం డిమాండ్ ఛార్జీల చెల్లింపులో వాయిదాలకు అనుమతించామన్నారు.
ఈ రెండు నిర్ణయాల కారణంగా 72,531 సూక్ష్మ పరిశ్రమలకూ, 24,252 చిన్న తరహా పరిశ్రమలకూ, 645 మధ్య పరిశ్రమలకూ మొత్తంగా 97, 428 ఎమ్ఎస్‌ఎమ్ఈలకు మేలు జరగనుందన్నారు. తద్వారా వాటిల్లో పనిచేసే 9,68,269 మందికి ఉపాధి విషయంలో లోటు ఉండదన్నారు.
ప్రస్తుతం ఎమ్ఎస్‌ఎమ్ఈలు తమ కార్యకలాపాలను పునరుద్ధరించుకోవడానికి వీలుగా, ఆర్థిక వనరుల సమీకరణలో తోడ్పాటు అందించడానికి ప్రభుత్వం బ్యాంకులకు గ్యారంటీ ఇస్తూ సబ్సిడీతో ఒప్పందం కుదుర్చుకుని, రూ.200 కోట్లు సమకూర్చుకుని, వాటిని వర్కింగ్ కేపిటల్‌గా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అతితక్కువ వడ్డీకింద ఈ వర్కింగ్ కేపిటల్ సమకూర్చాలని సమావేశంలో నిర్ణయం.
వస్త్ర పరిశ్రమల ప్రోత్సాహకాలకు సంబంధించిన రూ.1088 కోట్ల బకాయిలను చెల్లించేందుకు కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు వచ్చాక టెక్ట్స్‌టైల్ సహా ఇతర పరిశ్రమలను ఆదుకోవడానికి తీసుకోవాల్సిన మరిన్ని చర్యలు చేపట్టనున్నట్లు గౌతమ్ రెడ్డి తెలిపారు.
వస్త్ర పరిశ్రమలు సహా, భారీ, అతిపెద్ద పరిశ్రమలకు 3నెలల ( ఏప్రిల్, మే, జూన్ నెలల) మినిమమం డిమాండ్ ఛార్జీల చెల్లింపును వాయిదా వేయాలని నిర్ణయించామన్నారు. వీటికి ఎలాంటి అపరాధరుసుము, అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.
ఈ భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. దీనివల్ల అన్ని పరిశ్రమలకూ అదనపు వర్కింగ్ క్యాపిటల్ సమకూరుతుందన్నారు మంత్రి గౌతమ్ రెడ్డి.