కౌలు రైతు భరోసాకు చిరంజీవి తల్లి అంజనా దేవి ఆర్థిక సాయం
జనసేన పార్టీ తరపున కౌలు రైతులను ఆదుకునే బృహత్తర కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఇందులోభాగంగా, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కౌలు రైతులకు తన వంతు ఆర్థిక సాయం చేస్తున్నారు. అయితే, రైతు భరోసా యాత్ర ప్రత్యేక నిధికి ఆయన తల్లి అంజనాదేవి తనవంతు సాయంగా రూ.లక్ష విరాళం అందించారు.
అలాగే, జనసేన పార్టీకి మరో రూ.లక్ష విరాళం ఇచ్చారు. తన భర్త, హీరో పవన్ తండ్రి వెంకట్రావు జయంతి సందర్భంగా విరాళం చెక్కును హైదరాబాద్‌లో ఆమె అందజేశారు. తన తండ్రి పింఛను డబ్బులను ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కౌలు రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ఇచ్చినందుకు తల్లికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... కౌలు రైతుల భరోసాయాత్ర నిధి, జనసేన పార్టీకి విరాళం అందించిన తన తల్లికి కృతజ్ఞతలు తెలిపారు. 'సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని ఎందుకు కోరుకుంటానంటే అది మా ఫ్యామిలీకి భావోద్వేగంతో కూడుకున్నది. అందుకే సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావడానికి మా వంతు ప్రయత్నిస్తాం. ఉద్యోగులకు అండగా ఉంటాం' అని పవన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నం తదితరులు పాల్గొన్నారు.