బడ్జెట్ ఆమోదం కోసం.. ఒక్క రోజు అసెంబ్లీ సమావేశాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20వ తేదీన నిర్వహించాలని సీఎం జగన్ ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక ఎన్నికల కారణంగా మార్చిలో ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించలేదు. 3 నెలల కాలానికి బడ్జెట్‌కు ఆర్డినెన్స్ ఇచ్చారు. జూన్ 30తో ఆర్డినెన్స్ గడువు ముగియనుంది.
అదేసమయంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా అసెంబ్లీ నిర్వహించి బడ్జెట్‌ను ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎలాంటి చర్చా లేకుండానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రోజునే ఆమోదింప చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిసింది.
అయితే, బడ్జెట్ సమావేశాలని 21 నుంచి ప్రారంభించి రెండు, మూడు రోజుల పాటు జరపవచ్చన్న వాదనా లేకపోలేదు. తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారని, రెండో రోజున శాసనసభాపతి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల మండలి (బీఏసీ) సమావేశం జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.