భారత్‌లో కరోనా దుస్థితికి ఎన్నికల ర్యాలీలు - కుంభమేళానే కారణం : డబ్ల్యూహెచ్ఓ
భారతదేశంలో కరోనా వైరస్ మహమ్మారి ఉన్నట్టుండి విరుచుకుపడటానికి ప్రధాన కారణం ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలతో పాటు.. మతపరమైన కార్యక్రమాలే ప్రధాన కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. ఉధృతి పెరగడానికి సంక్రమణ వేగం ఎక్కువగా ఉన్న వైరస్ రకాలు మరో కారణమని తెలిపింది.
దేశంలో కేసులు అధికంగా నమోదవడానికి గల కారణాలపై డబ్ల్యూహెచ్ఓ ఓ నివేదికను విడుదల చేసింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి మతపరమైన, రాజకీయ పరమైన భారీ సమావేశాలు ప్రధానకారణమని పేర్కొంది. అదేవిధంగా సంక్రమణ వేగం ఎక్కువగా ఉన్న వైరస్ రకాలు వ్యాప్తిలో ఉండటం, ఆరోగ్య సామాజిక భద్రతా ప్రమాణాలను ప్రజలు పాటించకపోవడం కూడా దేశాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయని తెలిపింది.
బీ.1.1.7, బీ1.612 తదితర రకాల కరోనా వేరస్‌లో భారత్‌లో కేసుల వేగాన్ని పెంచాయని వెల్లడించింది. ప్రమాదకర బీ.1.617 రకాన్ని దేశంలో తొలిసారిగా గతేడాది అక్టోబర్‌లోనే గుర్తించినట్టు తెలిపింది. అందులో ఉప రకాలు కూడా తర్వాత వెలుగుచూశాయని తెలిపింది.
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 21 శాతం, బీ.1.617.1 వల్ల, ఏడు శాతం బీ.1.617.2 వల్ల వచ్చినవే ఉన్నాయని అభిప్రాయపడింది. ఇతర రకాలతో పోలిస్తే ఈ రెండూ అధిక సంక్రమణ వేగాన్ని కలిగి ఉన్నాయని వెల్లడించింది.