శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2019 (17:53 IST)

అబ్బే.. రాష్ట్ర విభజనతో పెద్దగా నష్టంలేదు.. బాబు సీఎంగా ఉండటం వల్లే... బొత్స

ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన వల్ల పెద్దగా నష్టం జరగలేదని సెలవిచ్చారు. కానీ, విభజన తర్వాత ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండటం వల్లే ఎక్కువ నష్టం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం రాజధాని అమరావతిపై జరిగింది. అపుడు చంద్రబాబు మాట్లాడుతూ, తన హయాంలో రాజధాని అభివృద్ధికి సింగపూర్‌కు చెందన స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో కుదుర్చుకున్న ఒప్పందం గురించి వివరించారు. ఆసమయంలో వైకాపా సభ్యులు కలుగజేసుకుని పలు అనుమానాలు వ్యక్తంచేశారు.
 
అపుడు మంత్రి సత్తిబాబు కలుగజేసుకుని మాట్లాడుతూ, రాష్ట్ర విభజనతో కంటే నవ్యాంధ్రకి ఐదేళ్లుగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని ఆరోపించారు. గతంలో ఎంఓయూలు కుదుర్చుకున్న సింగపూర్ ప్రతినిధులు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు మూడుసార్లు తమను కలిశారని చెప్పారు. 
 
గతంలో కుదర్చుకున్న ఎంఓయూలను ఏవిధంగా సాధిస్తారన్న విషయాన్ని వివరించి చెప్పమని ఆ ప్రతినిధులను తాము కోరామని, మళ్లీ వస్తామని చెప్పి వెళ్లారు తప్ప దీనిపై స్పష్టత ఇవ్వలేదని చెప్పారు. తాము సింగపూర్ ప్రతినిధులను వెళ్లగొట్టలేదన్నారు. చంద్రబాబు చేసింది తప్పు, వాటిని సమర్థించుకోవడానికి డొంక తిరుగుడు ధోరణిలో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 
 
పైగా, 'స్విస్ ఛాలెంజ్' పద్ధతి మన దేశంలో వద్దని సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించిందని గుర్తుచేశారు. సింగపూరుతో కుదుర్చుకుంది 'జీ టూ జీ' ఒప్పందం అని ఓసారి, 'స్విస్ ఛాలెంజ్' పద్ధతి అని మరోసారి అంటూ ఏదేదో చంద్రబాబు చెబుతున్నారని, ఆ ఒప్పందాల వెనుక స్వార్థ ప్రయోజనాలు చాలానే ఉన్నాయంటూ విమర్శలు గుప్పించారు.