ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు అస్వస్థత - ఆస్పత్రిలో చేరిక
ఏపీ అసెంబ్లీ స్పీకర్, వైకాపా నేత తమ్మినేని సీతారాం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హాటాహుటిన మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఈయనకు గురువారం రాత్రి నీరసంగా ఉండటంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆయనను కార్డియాలజిస్ట్ బుడుమూరు అన్నాజీరావు, ఫిజిషియన్ వేణుగోపాలరావులు పలు వైద్య పరీక్షలు చేసే క్రమంలో స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. అయితే, వైద్యులు మాత్రం ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేదని చెప్పారు. ఒక రోజు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు వెల్లడించారు.
ఇదిలావుంటే ఏపీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక వద్ద ప్రమాదానికి గురైంది. గురువారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆయనకు గాయాలయ్యాయి. చంద్రశేఖర్ రెడ్డి పీఏ ఘటనాస్థనంలోనే చనిపోయారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఐదుగురు ఉండగా, గాయపడిన వారిని నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్సీ తలకు గాయాలు కావడంతో ఆయనకు కూడా వైద్యం అందిస్తున్నారు. కాగా, విజయవాడ నుంచి నెల్లూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.