శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 16 అక్టోబరు 2017 (14:38 IST)

తుపానుల కంటే ముందే రైతులకు పంట దిగుబడి రావాలి.. సీఎం చంద్రబాబు

‘‘సంకల్పం మంచిదైతే ఫలితాలు కూడా మంచిగా వస్తాయి. నీరు-ప్రగతి, జలసంరక్షణ,సమర్ధ నీటి నిర్వహణ కార్యక్రమాలే అందుకు ఉదాహరణలు. ఆలస్యంగానైనా వర్షాలు సమృద్దిగా పడటంతో రైతులు సంతృప్తిగా ఉన్నారు. భూగర్భ జలమట్టం గతఏడాదికన్నా 5.5 మీటర్లు పెరిగింది. పట్టిసీమ మంచి

‘‘సంకల్పం మంచిదైతే ఫలితాలు కూడా మంచిగా వస్తాయి. నీరు-ప్రగతి, జలసంరక్షణ,సమర్ధ నీటి నిర్వహణ కార్యక్రమాలే అందుకు ఉదాహరణలు. ఆలస్యంగానైనా వర్షాలు సమృద్దిగా పడటంతో రైతులు సంతృప్తిగా ఉన్నారు. భూగర్భ జలమట్టం గతఏడాదికన్నా 5.5 మీటర్లు పెరిగింది. పట్టిసీమ మంచి ఫలితాలు వచ్చాయి, పంటలతో కృష్ణా డెల్టా పచ్చగా ఉంది. వందేళ్లలో లేని వరద ప్రవాహం పాలేరు వాగుకు వచ్చింది, కుప్పంలో జలకళ ఉట్టిపడుతోంది, చెక్ డ్యాముల నిర్మాణం, పంటకుంటల తవ్వకం వేగవంతం చేయాలి’’ అని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సోమవారం తన నివాసం నుంచి నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జలాశయాల్లో వరద ప్రవాహం(ఇన్ ఫ్లో,అవుట్ ఫ్లో) వివరాలను అడిగి తెలుసుకున్నారు.
 
తుపాన్లకు ముందే పంట దిగుబడులు రైతులకు అందాలి: 
‘‘తుపాన్లకు ముందే పంట దిగుబడులు రైతుల చేతికి అందాలి. వాతావరణం అన్నివిధాలా కలిసివచ్చే పరిస్థితి ఉంది. శాశ్వతంగా కరవు నివారించే పరిస్థితి రావాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం భూగర్భజలాలు, ఉపరితల జలాలు మొత్తం 1810 టిఎంసి ఉందన్నారు. 63% చెరువులు నిండాయని, ఇంకా 37% చెరువులు నిండాల్సి వుందని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన 2 కోట్ల ఎకరాల భూమిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పండ్లతోటల సాగు కోటి ఎకరాల్లో జరగాలన్నారు. అన్ని రిజర్వాయర్లు జలకళతో కళకళలాడాలని, ప్రతి రిజర్వాయర్లో కనీస నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. శ్రీశైలం కన్నా నాగార్జున సాగర్లో నీటినిల్వ అధికంగా చేరడం శుభపరిణామంగా పేర్కొంటూ, దీనిని సాగర్ ఆయకట్టు పంటలకు కుషన్‌గా ఉంచుకోవాలన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జలాశయాల్లో 135 టిఎంసిలు ఉంచుకుంటే నీటి కొరత సమస్యే రాష్ట్రంలో ఉత్పన్నం కాదన్నారు.
 
ఈ నెల 18-20 తేదీల మధ్య ఉత్తరాంధ్ర జిల్లాలకు తుపాన్ తాకిడి ఉందని ఇస్రో అధికారులు వివరించగా, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసి సకాలంలో సరైనవిధంగా అధికారులు స్పందించాలన్నారు.
 
ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగరాదు, అక్రమాలకు అవకాశం ఇవ్వరాదు: 
‘‘ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగరాదు, అక్రమాలకు అవకాశం ఇవ్వరాదు. రుణ ఉపశమనంపై రైతుల నుంచి అందే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి. 3వ విడత రుణ ఉపశమనం చెల్లింపులు త్వరితగతిన పూర్తిచేయాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న భారీవర్షాల వల్ల పంటనష్టం జరిగిన ప్రాంతాలను గుర్తించాలని, ఆయా ప్రాంతాలలో వెంటనే ఎన్యూమరేషన్ ప్రారంభించాలని ఆదేశించారు. మిర్చిపంటకు అధిక నష్టం జరిగిన విషయం ప్రస్తావించారు.పత్తి పంటకు తెగుళ్ల బెడద ఉత్పన్నం కాకుండా శాస్త్రవేత్తలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి రైతులకు కావాల్సిన సలహాలు,సూచనలు అందించాలన్నారు. పంటనష్టం నివేదికలను సకాలంలో పంపించాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు.
 
పండుగ వాతావరణంలో పింఛన్లు పంపిణీ చేయాలి: 
పెన్షన్లు, చంద్రన్న బీమా పరిహారం, రేషన్ పంపిణీ పండుగ వాతావరణంలో జరగాలని, రాష్ట్ర ప్రగతిని సూచించే బ్యానర్లు ప్రదర్శించాలని, చైతన్య స్ఫూర్తి పెంచే పాటలు వినిపించాలని సూచించారు. కొన్ని గ్రామాలలో తొలిరోజే పంపిణీ జరగగా మరికొన్ని గ్రామాలలో రెండోరోజు జరిగిందని గత నెల వివరాలను ప్రస్తావించారు. అన్ని వార్డులు, గ్రామాలలో ఒకటో తేదీనే పింఛన్ల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. 
 
ఉపాధి హామీ పనిదినాల్లో తమిళనాడు దేశంలో మొదటిస్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉందన్నారు. ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్యలో మన రాష్ట్రం అగ్రగామిగా ఉంటే కూలీల సంఖ్యలో పశ్చిమ బెంగాల్ ముందంజలో ఉందన్నారు. పంటకుంటల తవ్వకంలో దేశంలోనే మనం ముందున్నామని, అంగన్‌వాడి భవనాల నిర్మాణంలో 3వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పనులు అన్నింటిలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉన్నప్పుడే మన కృషి ఫలించినట్లు అవుతుందన్నారు.
 
ప్రజల్లో ప్రభుత్వంపై గౌరవం పెరగడం సానుకూల పరిణామం: 
‘‘రాష్ట్రంలో సుపరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. 1100 కాల్ సెంటర్ సత్ఫలితాలు ఇస్తోంది. ప్రభుత్వంపై ప్రజల్లో గౌరవం పెరుగుతోంది. ఇది సానుకూల పరిణామం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. జనవరికల్లా మరో లక్షా 25వేల గృహాల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. నిర్మాణం పూర్తయిన అన్ని ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించేలా చూడాలని కోరారు. కట్టబోయే ఇళ్లలో కూడా మరుగుదొడ్ల నిర్మాణం సమాంతరంగా  జరిగేలా శ్రద్ధ వహించాలన్నారు. 2016-17లో గ్రామీణ ప్రాంతాలలో మంజూరై ఇంకా ప్రారంభం కాని ఇళ్ల నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలన్నారు.
 
ఈ టెలికాన్ఫరెన్స్‌లో జలవనరులు, వ్యవసాయం అనుబంధ రంగాలు, గ్రామీణ పట్టణాభివృద్ది, అటవీ శాఖలు, హవుసింగ్, ఇస్రో, సెర్ప్, రైతుబజార్ల ఉన్నతాధికారులు శశిభూషణ్, వెంకటేశ్వరరావు, రాజశేఖర్, రాంశంకర్ నాయక్, మురళి, రామాంజనేయులు, జవహర్ రెడ్డి, అనంతరాములు, కాంతిలాల్ దండే, కృష్ణమోహన్, రమణమూర్తి, ప్రణాళికామండలి ఉపాధ్యక్షులు కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.