గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 ఏప్రియల్ 2022 (12:39 IST)

ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.. 11న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం

ys jagan
ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆశావాహుల్లో టెన్షన్ పెరుగుతోంది. ఆఖరి నిమిషంలోనూ లాబీయింగ్ చేస్తున్నారు. అంతకుముందే.. ఈ నెల 7న ప్రస్తుత మంత్రులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ భేటీ నిర్వహించబోతున్నారు. 
 
ఈ కేబినెట్ భేటీ తరువాత.. మాజీలైన మంత్రులకు జగన్ దిశానిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం. ఆ మరుసటి రోజే.. మంత్రుల రాజీనామా విషయాన్ని 8వ తేదీన గవర్నర్‌ను కలిసి సీఎం జగన్ వివరించనున్నారు. వారి స్థానంలో కొత్తవారిని తీసుకునేందుకు అనుమతించాలని కోరనున్నారు.
 
సీఎం జగన్ నిర్ణయానికి గవర్నర్‌ ఆమోదం తెలిపిన.. ఆ వెంటనే కొత్తగా మంత్రి వర్గంలోకి తీసుకునే వారికి సమాచారం ఇవ్వరని.. ప్రమాణ స్వీకారానికి ఒక రోజు ముందు మాత్రమే వారికి చెబుతారని తెలుస్తోంది.
 
అయితే ముందు ఏపీ కేబినెట్ సమావేశం ఏడో తేదీ ఉదయాన్నే అని షెడ్యూల్ ఉండేది. ఇవాళ, రేపు సీఎం జగన్ ఢిల్లీ పర్యటన. తరువాత వాలంటీర్ల సత్కారంతో షెడ్యూల్లో మార్పులు చేశారు. ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 7న మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు.
 
అయితే ముందు అనుకున్న ప్రకారం.. 11వ తేదీ ఉదయం 11:31 గంటలకు వెలగపూడిలోని సచివాలయ భవన సముదాయం పక్కనున్న స్థలంలో ఏర్పాటు చేయనున్న వేదికపై కొత్త మంత్రులతో గవర్నర్‌ ప్రమాణం చేయించనున్నారు.