సీఎం జగన్ కీలక ప్రకటన: రైతు ఖాతాలో ఉచిత విద్యుత్ డబ్బు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు కీలక ప్రకటన చేశారు. ఇంధన శాఖపై బుధవారం జరిగిన సమీక్షలో భాగంగా మాట్లాడిన జగన్... ఉచిత విద్యుత్‌కు చెందిన డబ్బును నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని తెలిపారు. ఆ తర్వాత విద్యుత్ బిల్లులను రైతులే చెల్లిస్తారని వెల్లడించారు. ఈ పద్దతి అమలైతే విద్యుత్ సేవలకు సంబంధించి రైతు ప్రశ్నించగలుగుతాడని జగన్ పేర్కొన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో భాగంగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, సప్లై, పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రాజెక్టులు తదితర అంశాలను జగన్ సమీక్షించారు.
వినియోగదారులకు ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో భారీగా విద్యుత్తును కొనుగోలు చేశామన్న అధికారులు... మార్చిలో 1268.69 మిలియన్ యూనిట్లను రూ.1123.74 కోట్లు వెచ్చించి కొన్నామని వెల్లడించారు. ఏప్రిల్‌లో 1047.78 మిలియన్ యూనిట్లను రూ.1022.42 కోట్లతో కొన్నామని వెల్లడించారు.
ఇకపోతే.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు శ్రీ బాలాజీ జిల్లా కేంద్రం తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తిరుపతిలో ఏర్పాటు చేయనున్న జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. లబ్ధిదారులు, వారి తల్లిదండ్రులతో జగన్ మాట్లాడతారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.