గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 డిశెంబరు 2022 (15:41 IST)

ఏపీలో మారిపోతున్న సమీకరణాలు... ప్రధానితో భేటీకి హస్తినకు సీఎం జగన్

jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 2024లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి నుంచి ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. విపక్ష నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సభలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అదేసమయంలో సీఎం జగన్ సభలకు బలవంతంగా డబ్బులు, బిర్యానీ, మద్యం పంపిణీ చేసి తరలించిన వారు ఎక్కువ సేపు సీట్లలో కూర్చోలేని పరిస్థితి నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం సాయంత్రం హస్తినకు బయలుదేరి వెళుతున్నారు. ఆయన ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ఆయన విభజన హామీలను అమలు చేయాలంటూ మరోమారు విజ్ఞప్తి చేయనున్నారు. అలాగే, రాజకీయ అంశాలు కూడా వారిమధ్య ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఏపీలో శరవేగంగా మారిపోతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ కావాలని నిర్ణయించడం ఇపుడు హాట్ టాపిగ్గా మారింది. 
 
అలాగే, పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలుసుకోనున్నారు. ఇందుకోసం ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లు కూడా ఖరారు కాగా, మరికొందరి అపాయింట్మెంట్లు ఖరారు కావాల్సివుంది. అదేసమయంలో ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ, ఏపీ రాష్ట్రం పేరెత్తకుండానే ఓ రాష్ట్ర తన ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందంటూ వ్యాఖ్యానించారు. ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వార్తలను నిజం చేసేలా ఏపీలో ఇప్పటికీ కొందరు ఉద్యోగులకు, పింఛనుదారులకు నవంబరు నెల వేతనాలు, పింఛన్లు ఇవ్వలేదు.